04/02/2018
కొలువుల కాలం
మే నెలాఖరు నాటికి 30 వేల ఉద్యోగాల భర్తీ
టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు
ఏప్రిల్‌కు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
వారంలో గ్రూప్-2కు క్లియరెన్స్?
మార్చి రెండో వారానికి ఎంపిక పూర్తి!
నెలలో 5 వేల గ్రూప్-4 పోస్టులు
విద్యుత్తులో మరో 1,871 భర్తీ
నిరుద్యోగ యువతకు తీపి కబురు! పోలీసు కొలువులు.. టీచర్ కొలువులు.. గ్రూపు-2 కొలువులు.. గ్రూప్-4 కొలువులు.. రాష్ట్రంలో రాబోయే మూడు నాలుగు నెలలూ వరుసగా కొలువుల జాతరే! పోలీసు శాఖలో 14,177 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యుత్తు శాఖలో 1,871 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే కొనసాగుతోంది. ఇక, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎ్‌సపీఎస్సీ వేగం పెంచింది. మే నెలాఖరుకు 30 వేల మందికి నియామక పత్రాలు ఇవ్వడమే లక్ష్యంగా చర్యలుచేపట్టింది. ఏప్రిల్‌కు పీజీటీ, టీజీటీ, మిగతా అన్ని కేటగిరీల 7300 గురుకుల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. అలాగే, విద్యా శాఖ పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 8,792 పోస్టులకు ఫిబ్రవరి 24నుంచి రాత పరీక్షలు నిర్వహించి ఏప్రిల్ చివరికి నియామకప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది.
భారీగా కొలువుల భర్తీకి అనుమతి
అటవీశాఖలో 2వేల పోస్టుల భర్తీకి రాత పరీక్ష పూర్తిచేసిన టీఎస్ పీఎస్సీ.. నెల రోజుల్లో వీటి భర్తీ ప్రక్రియను పూర్తి చేయనుంది. 1036 గ్రూప్-2 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. కోర్టు కేసులతో కొన్ని నెలలుగా ప్రక్రియ నిలిచిపోయింది. కేసులో వారంలోగా హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే వారంలోగా ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభించి మార్చి రెండో వారానికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. అంతేనా, సుమారు 5 వేల పోస్టులతో నెల రోజుల్లో గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వీటిలో పంచాయతీ సెక్రటరీ పోస్టులు 2500, వీఆర్‌వోలు 1200, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్,దేవాదాయశాఖలో 800పోస్టులు ఉన్నాయి. విద్యుత్తు శాఖలో 1871 ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రాన్స్‌కోలో 1100 జూనియర్ లైన్‌మెన్, 174 సబ్ ఇంజనీర్, 330 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. జేఎల్‌ఎం పోస్టులకు ఈనెల 11న; సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు 25న; ఏఈ పోస్టులకు మార్చి 3న రాతపరీక్ష జరగనుంది. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్ (హైదరాబాద్)లో 153 ఏఈ, 114 జేఏవో పోస్టుల భర్తీకి ఈనెల 19లోగా దరఖాస్తుల స్వీకరణ, మార్చి 25న రాతపరీక్ష ఉండనుంది
Source:Ranjith