05/09/2024
మీరు టీచర్ అయితే చదవండి
కాకపోతే తప్పకుండా చదవండి...
స్కూళ్ళలో టీచర్లు విద్యార్ధుల క్రమశిక్షణ గురించి శ్రద్ద తీసుకునే నెపంతో తరచుగా బాలుర హెయిర్ స్టైల్ మీద పడిపోతూ వుంటారు. గుప్పెడు జుట్టు ఎక్స్ట్రా పెంచుకున్న పిల్లాడు మొత్తం స్కూలుకే శత్రువు అవుతాడు. పాఠాలూ, పరీక్షలూ, పాలిటిక్స్... ఇలాంటి ఏవిషయంలోనూ ఏకం కాని స్టాఫ్ రూం వీడి ఒక్కడి విషయంలో మూకుమ్మడిగా నిలబడి వాడు పాఠశాల జనరల్ కాండంక్ట్ కే మాయని మచ్చ అని తేల్చేస్తుంది.
పోనీ మిషన్ తో చుట్టూ కురచగా కత్తిరించుకుని పైన కాస్త వదిలేస్తేనైనా వదిలేస్తారా? వుహూ... వాడికి పెట్టని పేరూ, చేయని ఎగతాళీ వుండదు. ఉడతల క్రాఫు, డిప్ప కటింగ్, బొచ్చె తల... ఇలాంటి పేర్లతో అవమానించి సాడిజం తీర్చుకోని మేష్టారు వుండడు.
ఎందుకు ఇలా? అదే ఒక బాలిక బోయ్ కట్ చేసుకుని వస్తే అలా ఆమెను కూడా గాలిది అని అనరు సరికదా, జీవితాంతం ఆమెను ఒక లిబరేటెడ్ స్త్రీగా గుర్తుంచుకుంటారు.
ఎవరు నిర్ణయించారూ.. బాలురు పాపిట తీసుకుని సమంగా క్రాఫు చేయించుకుని స్కూలుకు రావాలి అని? బారుగా జుట్టు పెంచుకున్న అమ్మాయి సంప్రదాయ బాలిక, బెత్తెడు ఎక్కువ పెంచుకున్న అబ్బాయి జులాయి... ఎవరు ఏర్పరచిన స్టాండర్డ్స్ ఇవి? కాలంతో అనేక ఫ్యాషన్లు మారిపోయాయి కదా? మేష్టార్లు తాము చదువుకునే రోజుల్లో వేసిన బెల్ బాటం ప్యాంట్లు ఇప్పుడు వేస్తున్నాడా? లేదా అప్పుడు అల్ట్రా మోడ్రన్ గా అమ్మాయిల్లో క్రేజ్ సంపాధించుకున్న బ్యాగీ స్టైల్ ఇప్పుడు తొడుగుతున్నాడా? లేదు కదా.. కార్పోరేట్ ఫార్మల్ స్టైల్ వేస్తూనే వున్నాడుగా? అత్యధిక మగ ఉపాధ్యాయులు తరచుగా స్కూలుకు జీన్స్ వేసుకు వెళుతూనే వున్నారుగా? మేష్టారమ్మలు మగ్గం చీరలూ, డోరీ బ్లౌజులూ వేస్తూనే వున్నారుగా? చీర బొడ్డు పైన కట్టాలో, కింద కట్టాలో అనే విషయంలో తమ లిబరేషన్ తాము అనుభవిస్తూనే వున్నారు కదా? మరి రెండు జడలు వేసుకోని అమ్మాయిల మీద అంతలేసి కోపం, చులకన భావం ఎందుకూ? 21వ శతాబ్ధంలో కూడా 18వ శతకపు రెండు జడలే గుడ్ గర్ల్ కి స్టాండర్డ్ డెకరేషనా? స్కూళ్ళలో పిల్లలు పోనీ వేసుకు వెళితే తప్పేంటీ? ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలా జుట్టు మీద ఆంక్షలు లేవు. యూనిఫాం వేసుకోవడం కంపల్సరి. జుట్టు మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ మనమే ఎందుకు ఇలా సాడిజాన్ని డిసిప్లిన్ పేరుతో అమలు చేస్తున్నాం? హెయిర్ స్టైల్ మీద శ్రద్ద చూపే పిల్లలు చదువును అశ్రద్ద చేస్తారు అనే బూటకపు సిద్దాంతం ఎవడు చెప్పాడూ? అలాంటి సిద్దాంతం ఏదైనా ఎడ్యుకేషన్ సైకాలజీలో రాసుందా? బాలికలు అంతలేసి జుట్టు పెంచుకుంటూనే చదువు మీద శ్రద్ద చూపిస్తున్నారు కదా?
సరే అమ్మాయిలైతే తమ బారు జుట్టును స్కూలుకు రెండు జడలుగా వేసుకుని వచ్చినా పండగ రోజో, ఫంక్షన్ రోజో అదే జుట్టును స్టైల్ చేసుకు వెళతారు. కానీ అబ్బాయిలు ఆ అంట కత్తెరను ఫంక్షన్ కోసం ఎలా మార్చుకోగలరూ? కాస్త ఫంకీగా కనబడటానికి జుట్టే కదా ఆధారం... అది ఒకసారి శీలవంతమైన సైజుకు కత్తిరించబడిన తరవాత పార్టీ స్టైలుకు పనికి రాదు కదా? ఏం? వాడికి ఫేషనబుల్ గా కనబడే అర్హత లేదా? పెళ్ళికి వెళ్ళోచ్చిన అమ్మాయి వారం రోజులు మెహెందీ చేతులతోనే స్కూలుకు రావడం ఆమె సంప్రదాయ పోషణకు నిదర్శనం అయినప్పుడు, అబ్బాయి కాస్త రెండంటే రెండు పోచలు బ్లీచ్ చేయించుకుని వస్తే అంతలేసి కళ్ళు మండాల్సిన అవసరం ఏముందీ? సరదాగా నవ్వుకుని వదిలెయ్యలేరా? 'యు ఆర్ లుకింగ్ స్టన్నింగ్ మ్యాన్ ' అని సరదాగా ప్రశంశించి పాఠం మొదలు పెట్టలేరా టీచర్లు?
అదంతా అటుంచితే ఈ మేష్టార్లు కోరుకున్న లెవెల్ కి జుట్టు కత్తిరించుకుని కొబ్బరి నూనె రాసుకుని పాపిట తీసుకు వచ్చే పిల్లలంతా స్కూలు పరువును భుజాలకెత్తుకుని దేశభవిష్యత్తును నెత్తిన వేసుకు వూరేగే రకాలు అవుతారని గ్యారెంటీ వుందా?
అయ్యా... అమ్మా... అనేక సార్లు ఈ విషయాన్ని చెబుతూనే వున్నాను.... బాలుర లో వెయిస్ట్ ప్యాట్లలో చేతులు పెట్టి మరీ వాళ్ళకు మీరు డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు.... పాక్సో నిబంధనలకు విరుద్దం... లోపలకు వెళతారు. వెయిస్టు మీదకు ప్యాంట్లు కుట్టించుకునే ఫ్యాషన్ పోయి ఇరవై ఏళ్ళు అవుతుంది. మీరు రిప్ వాన్ వింకిల్ నకరాలు మానేస్తేనే బెటరు. అమ్మాయిలను అంటుకోవడం ఎంత నేరమో అబ్బాయిలను అంటుకోవడం కూడా అంతే నేరం. జర జాగ్రత్త...!
జుట్టు గురించి అరగంట క్లాసు పీకిన మేష్టారి మాటలు గుర్తు చేసుకుని ఇంటికి వచ్చి ఏడ్చిన టీన్ ముందు కూర్చుని ఈ మాటలు రాస్తున్నా.... ఇంకా ఎంత కాలం వేచి చూడాలో ఈ విద్యావ్యవస్థ శీలపరీక్షల బలహీనత నుండి బయట పడటానికి...