20/01/2022
మానవుడు భోగాలకు బానిస, విషయసుఖాలను అనుభవించాలనే వాంఛ స్వార్థానికి సంకేతం. భోగాలు కోసం వెంపర్లాడేవాడు తోటివారి సుఖసంతోషాలను పట్టించుకోరు. ఎప్పుడూ తన సౌఖ్యం, తన స్వార్థమే లక్ష్యంగా జీవిస్తారు. అలాంటి వారికి తనలో ఉన్న చైతన్యమే ఇతరులలో కూడా ఉన్నదన్న ఆలోచనే రాదు. తన సౌఖ్యం కోసమే ఆలోచిస్తూ, ఇతరుల కష్టాలను గుర్తించనివారు ఎన్నటికీ శాశ్వతమైన మనశ్శాంతిని పొందలేరు.
కోరికలు రెండు రకాలు - మంచివి, చెడ్డవి, స్వార్థంతో కూడుకున్న ప్రతి కోరికా చెడ్డదే! అది మనశ్శాంతిని ఇవ్వదు. నిస్వార్థమైన కోరిక వల్ల ఇతరులకు మేలు జరగడంతో పాటు మనకు మనశ్శాంతి లభిస్తుంది. కామం, క్రోధం, లోభం అనేవి స్వార్థపరమైన కోరికల వల్ల ఉద్భవిస్తాయి. అవి మనిషికి కీడు చేస్తాయి. సత్పురుషులు వీటికి అతీతంగా ఉంటారు. అలాంటి పవిత్రాత్ములు చేసే ప్రతీ పని అందరికీ మేలు చేసేదిగా ఉంటుంది. ప్రాపంచిక కోరికలను త్యజించడం వల్లనే నిజమైన శాంతి లభిస్తుందని గ్రహించినవారు ఉత్తములు.
సేకరణ - రామకృష్ణ మఠం.
19/01/2022
ఇష్టదైవం పట్ల శ్రద్ధాభక్తులు ఉన్నవాడు నిశ్చయముగా భగవంతుడిలో ఐక్యం పొందుతాడు.
- భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస
25/09/2021
చూచితి నీదు రూపమును చూచితి నీ గుడి ద్వారబంధముల్, చూచితి నీదు గర్భగుడి చూపులు నిండుగ నిలిచి చూచితిన్, చూచితి దండి భాగ్యమని నాకనులార నిన్ను నే చూచితి దైవమీవేయని చూచితి నే నిను వేంకటేశ్వరా !!!
02/04/2021
వేద రహస్యములను వక్రీకరిస్తే ... » Samgatulu
కొన్ని శ్లోకాలు చదివితే ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.కానీ, ఇందుకు భిన్నంగా ఈ శ్లోకం ఆస్తిక చదువరులకు ఉంటుంది. ఇత....
27/12/2020
దీర్ఘాయుష్ట్యాయ, బలాయ వర్చసే శిఖాయై వషట్"
శిఖ కీర్తిని, యైశ్వర్యమును ఒసంగును.
28/07/2020
శ్రీమద్రామాయణ మహిమ - పార్ట్ ౧
వేదములోని కర్మకాండార్థమును మన్వాది ధర్మశాస్త్రములు వివరించును. ఇతిహాస పురాణములు వేదాంతార్థమును విశదీకరించును. 'యతో వా ఇమాని' అను విషయవాక్యము సృష్టి స్థితి లయముల కెద్ది మూలకరణమో అది బ్రహ్మమని చెప్పుచున్నది. జగజ్జన్మాదులకు కారణమగు పరబ్రహ్మము విష్ణువా లేక బ్రహ్మ రుద్రాదులా యను విచారణలో శ్రీమద్రామాయణము శ్రీరాముడై యవతరించిన విష్ణువే వేదాంతములలో చెప్పబడిన పరబ్రహ్మమని ఉద్ఘోషించుచున్నది. ఇందుకు కొన్ని ప్రమాణములుగలవు. అవి యేవియన :
౧. ఉపక్రమము
౨. ఉపసంహారము
౩. అభ్యాసము
౪. అపూర్వత
౫. ఫలము
౬. అర్థవాదోత్పత్తి...అనునవి ప్రమాణములు.
Continues....
26/07/2020
నారాయణుడు చేసిన శ్రీకృష్ణస్తుతి: (శ్రీ బ్రహ్మవైవర్త పురాణం - శ్లో|| 10-13, అధ్యా-3, ప్ర. ఖం.)
వరం వరేణ్యం వరదం వరార్హం వరకారణం |
కారణం కారణానాంచ కర్మ తత్కర్మ కారణం ||... 1
తపస్తత్ఫలదం శశ్వత్త పశ్వీశం చ తాపసం |
వందేనవఘన శ్యామం స్వాత్మారామం మనోహరం ||... 2
నిష్కామం కామరూపంచ కామఘ్నం కామకారణం |
సర్వం సర్వేశ్వరం సర్వబీజరూపమనుత్తమం ||... 3
వేదరూపం వేదభవం వేదోక్త ఫలదం ఫలం |
వేదఙ్ఞం తద్విధానంచ సర్వవేదవిదాంవరం ||... 4
17/07/2020
మా నాయకుడు శ్రీరాముడు - ఒక వానరుని అంతరంగ తరంగం
నేనొక సుగ్రీవుని బంటు ఒక మామూలు వానరాన్ని. వాలినుండి తప్పించుకుని ఋష్యమూక పర్వతం పై తలదాచుకున్న మమ్మల్ని ఉద్ధరించడానికి అన్నట్టు మా వీరుడు హనుమయ్య ఇద్దరు సర్వాంగ సుందరులను తీసుకువచ్చాడు. వారిని చూస్తే మాకు నోటమాట లేదు. ఆజానుబాహులు. అరవిందదళాయతాక్షులు. ఆహా ఎంత సుకుమారంగా అందంగా పుంసాం మోహన రూపాయ లా దేవతల్లా ఉన్నారో ఇద్దరు. పెద్దవాడు నీలమేఘశ్యాముడు, చిన్నవాడిని పేరుకానీ అచ్చం పెద్దవాడిలా ఉన్నాడు కానీ మెరిసిపోతున్నాడు. వాళ్ళు తమను తాము రామలక్ష్మణులుగా పరిచయం చేసుకుని అగ్ని సాక్షిగా మా నాయకుడితో స్నేహం చేసుకున్నారు. పాపం రాముని పత్ని అపహరణకు గురయిందిట. తీసుకువెళ్లినది రావణుడు అన్న రాక్షసుడు. అరే, ఆ రావణుడు మా సుగ్రీవుడి అన్నగారైన వాలికి బంటు వంటి వాడు, మూడు సముద్రాలు చంకలో పెట్టుకుని తిప్పి మూడు చెరువులు నీళ్లు తాగించాడు. ఈ రాముడు వెళ్లి వాలిని పట్టుకుని ఉంటే వెంటనే విడిపించేవాడు కదా, ఏమిటి అమాయకత్వం అనుకున్నాను. అయినా వాలి భయంతో మేమంతా ఇక్కడ తలదాచుకుంటూ ఉంటె మాకొక పెన్నిధిలా దొరికాడు ఈయన. వాలితో సంధి చేసినా చాలు అని ఆలోచిస్తూ బ్రతుకుతున్న వాళ్ళం. ఈయనేమిటో వాలిని చంపేస్తానని చెబుతున్నాడు. మంచి కండబలం ఉన్నవారిలా కనిపించినా వాలి అంతటి మహావీరుడిని ఎదుర్కోగలడా అనుకున్నాం మేమంతా. ఇదే విషయం సుగ్రీవునికి కూడా తట్టి ఆయన బలం అంచనా వెయ్యడానికి అంతకుముందు చంపిన దుందుభి అన్నరాక్షసుని కళేబరంవద్దకు తీసుకువెళ్ళాడు. ఆయన తన పాదాంగుష్టంతో గిరాటువేస్తె వందయోజనాలు దూరం యెగిరిపడింది. మాబోటివారు ఓ వందమంది కలిసినా అంగుళం కదలనిది అంత ఎత్తున అంత దూరం వెళ్లడం చూసి మానోట మాట రాలేదు. వీరిలో ఏదో ఉందని అనుకున్నాం. తరువాత ఏడు తాళ వృక్షాలను ఒక్క బాణంతో కొట్టేసాడు. ఇక ఈయనపై మాకు భయంతో కూడిన భక్తి కలిగింది.
సుగ్రీవుని ప్రోత్సహించి వాలితో తలపడేలాచేశారు. అసలే వాలి తో ఎదురుగా ఎవరైనా పోరాటం చేస్తే వాళ్లలో సగం బలం హరించేస్తాడన్న వరం గురించివిని ఉన్నాం. ఈయన ఎలా పోరాటం చేస్తాడో అనిచూస్తూ ఉంటె మాబోటి జంతువులను వేటాడేటప్పుడు ధర్మం ప్రకారం చెట్టు చాటున దాగి కొట్టవచ్చు అని వాలిని ఒక్క దెబ్బతో కొట్టి పారేసాడు. వాలి ఎన్నో నిందలు మోపినా చాలా ప్రశాంతంగా వాలికి ధర్మబోధ చేసి వాలి చేసిన తప్పుకు మరణమే సరైన శిక్ష అని ఆయన చెప్పేతప్పిటికి ఎవరి మాటావినని ఆ మూర్ఖ బలవంతుడు రాముని శరణమని ఆయన పాదాలపై పడి ప్రాణాలు వదిలాడు. తరువాత మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విషయం మా కుటుంబంతో కలిసి కొన్ని నెలలు ఆనందంగా గడిపాము. మా సుగ్రీవుడు రాజయ్యాడు. ఇకమాకంతా సంతోషం అని తెలిసింది. కానీ మాకిన్ని ఇచ్చిన ఆయన పాపం తమ్ముడితో ఒంటరిగా రాజ్యం బయట గుహలో బాధపడుతున్నాడు. అయ్యో ఆయనకు మేము ఏమీచేయలేమా అనుకుని బాధపడే వాళ్ళం. ఈలోపు వర్షాకాలం ముగిసింది. సుగ్రీవుడు అన్నివైపులనుండి మా వానర సేనలను పిలుస్తున్నాడు. మేముకూడా రామకార్యంలో పాలు పంచుకుందాం అని మేమంతా ఉత్సాహంగా సమాయత్తం అయ్యాము. మా అదృష్టం కొద్దీ మేము హనుమ, అంగద, జాంబవంత నాయకత్వంలో అమ్మవారి జాడ కనుక్కోవడానికి బయలుదేరాము.
ఒక నెలరోజులు దక్షిణదిశగా అన్నీవెతికాము. ఎక్కడా అమ్మవారి జాడకనబడలేదు. ఇక ఈ ముఖాలు మరల సుగ్రీవుడికి రాముడికి చూపించలేమని సముద్రతీరంలో ప్రాయోపవేశం చేద్దామనుకున్నప్పుడు ఎక్కడినుండో ఒక ముసలి గద్ద కాదు పెద్ద గండభేరుండం వచ్చి మమ్మల్ని తినబోయింది. అంగదుడు హనుమలు రామకథ చెప్పగా అందులో ఆ గద్ద తమ్ముడైన జటాయువు పేరు విని ఉలిక్కిపడి అతడి విషయం పూర్తిగా తెలుసుకుని బాధ పడి మాకు సహాయం మాటిచ్చి అక్కడకు వంద యోజనాల దూరంలో సముద్రానికి ఆవలనున్న లంక గురించి చెప్పి రావణుడు అక్కడకే తీసుకువెళ్లాడు అమ్మవారిని అనిచెప్పి తనకు అక్కడ ఆవిడ కనబడుతోందని చెప్పాడు. మాకు నిజంగా అమృతం తాగినంత ఆనందంతో గెంతులు వేసాము. అదేమి మాయో అప్పటివరకు కుంటుతూ నీలుగుతూ ఉన్న ఆ గద్ద సంపాతికి రెక్కలు వచ్చి యౌవనం వచ్చింది. ఎటో యెగిరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాలో ఎవరు వంద యోజనాలు వెళ్ళగలం అని ఆలోచిస్తూ అందరం మా మా బలాలు చెప్పుకుంటున్నాం. అదేమిటో జాంబవంతుడు ఏదో మంత్రం వేసాడు. అప్పటివరకు మాకు బుద్ధిమంతుడుగా మాత్రమే తెలిసిన హనుమ ఏదో పూనకం వచ్చిన వాడిలా త్రివిక్రముడిలా ఎంతో ఎత్తు ఎదిగాడు. చెప్పకూడదు కానీ ఆరూపం చూసి మాకే ఒకవైపు ఆనందం మరో వైపు భయంకూడా కలిగాయి. వెళ్ళాడు ఆ పావనకుమారుడు మరల మరసటి రోజు వస్తూ వస్తూ సింహనాదం చేసాడు తాను అమ్మవారిని చూసాను అని… అబ్బా...ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఏదో నేనే పని సాధించినంత ఆనందించాను. ఎగిరాను, పల్టీలు కొట్టాను పక్కనున్న వానరాలను ఆలింగనం చేసుకున్నాను. నేను నాలో కొన్నిఘడియలు లేను. అంగదుని అనుమతి తీసుకుని ఒక తోటలో మధువు తాగాం, పళ్ళుతిన్నాం అడ్డొచ్చిన వాడి నడ్డి విరగ్గొట్టాము. మొత్తానికి రాముడి వద్దకు చేరి అందరం కలిసి నివేదించాం. ఆయన మా హనుమయ్యను గట్టినా పట్టుకుని ఆయన పరిష్వంగ వరాన్ని అనుగ్రహించాడు. మమ్మల్నే ఆలింగనం చేసుకున్నంత ఆనందపడ్డాం.
అందరం కలిసి సముద్రంవద్దకు వెళ్లాం. ఇప్పుడు ఎలా దాటాలో తెలియదు. విభీషణుడు వచ్చి రాముని శరణువేడాడు. శత్రువులను మనం కలుపుకోవడం ఏమిటి అనుకున్నాం. ఆశ్చర్యకరంగా రాముడు అతనికిఅభయం ఇచ్చి లంకారాజుగా అభిషేకం కూడా చేసేసాడు. ఈలోపు శ్రీరాముడు సముద్రునిగురించి ఒకరెండు రోజులు ధ్యానంచేశారు. మరొకరెవరైనా అలా చేసుంటే ఏమిటిది అనుకునేవాళ్ళం కానీ రాముని ప్రభావం తెలుసుకున్న వాళ్ళం ఆయనమీద సంపూర్ణమైన విశ్వాసంతో జరగబోయే లీల గురించి చూస్తున్నాం. ఆయనకు కూడా కోపం వచ్చి ఒక్క బాణం తీయగా పరుగుపరుగున సముద్రుడు రాముని పాదాలు పట్టుకుని మాలోని నలనీలుల ద్వారా వారధి కట్టమని ప్రాధేయపడ్డాడు. ఇలా సముద్రదేవత దర్శనం చేసుకున్నాము. ఎంతో ఉత్సాహంగా ఎన్నో రాళ్ళ మీద రామనామం రాసుకుని మోసుకుని మొత్తానికి ఐదు రోజుల్లో వంద యోజనాల వారధి కట్టి లంకకు చేరాము. యుద్ధం మొదలయ్యింది. రావణుడి తమ్ముడు మావైపున్నాడు, లంక రాక్షసులను చీల్చి చెండాడుతున్నాము. మేమెంత మా బలమెంత. అంతా రాముని దయ. అక్కడున్న రాళ్లతో చెట్లతో ఆ రాక్షసులను దునుమాడుతున్నాము. మాకు దెబ్బలు తగిలాయి. కానీ రాముని చల్లని చూపు తగిలి అన్నీ వెంటనే మాయమయిపోయాయి. ఈలోపు ఎందరో రాక్షసవీరులు హతమయ్యారు. రావణుడి కొడుకుట ఏదో గొప్ప బ్రహ్మాస్త్రం వేసాడు...అందరం మూర్ఛలోకి పోయాము. మరల రాముడి దయవల్ల కోలుకున్నాం. నాగాస్త్రం వేసాడు ఎన్నో పాములొచ్చి కరిచి పడిపోయాము.గరుత్మంతుడు వచ్చాడు మరలసంపూర్ణ ఆరోగ్యంతో నిలబడ్డాం. అత్యంత భారీకాయుడు కుంభకర్ణుడు వచ్చాడు , మాలో కొన్ని వేలమందిని తిన్నాడు తొక్కేసాడు, మరల తప్పించుకుని రాముని శరణువేడాం.వాడిని చంపి అవతల పారేసాడు. లక్ష్మణుడు మూర్చిల్లాడు..ఇదెలా సాధ్యం అనిఅందరం బాధపడ్డాం. మా హనుమ వెళ్లి ఒక పెద్ద సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుని పునరుజ్జీవితుడినిచేసాడు. ఇక రామరావణ యుద్ధం… మేమంతా మా యుద్ధాన్ని పక్కనపెట్టి వాళ్ళ యుద్ధాన్నీ చూసాం. ఒకసారి రావణుడిని మొత్తం కొట్టేసి వెళ్లి మళ్ళీ రా అని పంపేశాడు ధర్మమూర్తి రాముడు. ఆఖరికి మరల పదితలల రావణుడు పూర్తిగా సన్నధ్ధుడై వచ్చాడు. ఆఖరికి రాముని చేతిలో చచ్చాడు. మా ఆనందానికి అంతులేదు. ఎంతో ఆశతో అమ్మవారి దర్శనం చేసుకున్నాం. మా ఆనందం ఆవిరైపోతూ రాముడు అగ్నిపరీక్ష అడిగారు...కానీ ఆయన ఏమిచేసినా ఒక అర్ధం పరమార్ధం ఉందని మాకు నమ్మకం. అమ్మవారిని అగ్గి ఏమిచెయ్యలేక పోయింది. పైనుండి దేవతలంతా వచ్చారు రాముని శరణన్నారు.రాముడు తనకోసం ఏమైనా కోరుకుంటాడని అనుకుంటే మా సైన్యంలో వీరస్వర్గం అలంకరించిన మాస్నేహితులనందరినీ బ్రతికించాడు. ఆహా ఏమి దయ స్వామిది ? మాకు ఆనందభాష్పాలు ఆగలేదు.
ఎక్కడో చెట్లు పుట్టలు పట్టుకు తిరిగే మేమెక్కడ? మాకా ఒక క్రమశిక్షణ లేదు. మా మనస్సులా మేము ఒక చోట ఉండలేము. ఒక విషయం పై ఎక్కువ సేపు మనసు పెట్టలేము. అత్యంత చంచలస్వరూపులం. అటువంటి మమ్మల్ని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఆయనకు అవసరం లేకపోయినా ఆయన కార్యంలో మమ్మల్ని భాగస్వాములను చేసి మాకు గౌరవం కలుగచేసారు. ఆయన శక్తి కన్నులారా చూసాము. ఆ అన్నదమ్ములు ఇద్దరూ చాలు మొత్తం మూడులోకాలు చుట్టిపెట్టెయ్యడానికి. కానీ మమ్మల్ని వారి కార్యంలో కలిపి మాకు గౌరవం ఇచ్చారు. అందరినీ ఆశీర్వదించి అమ్మవారితో కలిసి వారి అయోధ్యకు వెళ్లారు. మేమంతా కిష్కింధకు వెళ్లినా మాకు ఎప్పుడూ ఆయన ధ్యాసే. ఆయనతోనే కలిసి ఉండాలన్న తపన. ఏజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నామో ఆయన దర్శనం కలిగింది, అంతేకాదు ఆయనతో కలిసి తిరిగాము ఆయనను రోజూ దర్శించాము తరించాము. మాకోరిక కాదనలేక మరల మాకు ఆ సౌభాగ్యాన్ని కృష్ణావతారంలో మమ్మల్ని గోపికలుగా పుట్టించాడు. ఇది కాదా సౌభాగ్యము, ఇది కాదా తపము. ఇంకా ఆయన మీద పూర్తి భక్తి కలుగలేదనుకుంటా, ఇప్పుడు ఈ జన్మనిచ్చాడు పరంధాముడు. మరి ఆయన దర్శన భాగ్యం ఎలా అంటే చిరంజీవి హనుమ ఉన్నాడు. ఆయన్ను పట్టుకోమని గురువును పంపాడు. ఆయన దయవల్ల హనుమను పట్టుకున్నాం. మాశ్రీరాముడే చిదానంద రూపంగా తిరుమలలో నిలుచునిఉన్నాడు మమ్మల్నిఉద్ధరించడానికి.ఇకపై దారి చూపవలసినది ఆయనే.
అన్యథాశరణంనాస్తి త్వమేవ శరణంమమ
తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్ధన
!! జైశ్రీరామ్ !!
!! ఓం నమో వేంకటేశాయ!!
!! సర్వము శ్రీవేంకటేశ్వరార్పణమస్తు!!
16/07/2020
శ్రీవిష్ణుపాదోద్భవ - సర్వ పాప నివారిణి గంగమ్మ
భారతీయ సంస్కృతికి, భారతీయుల జీవనాధారం సర్వపాపహారిణి గంగ. దేవీభాగవతం ఆధారంగా గంగమ్మ వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీరాధా కృష్ణ ల ప్రతిరూపం. ఒకసారి అన్నిలోకాల పైనున్న గోలోకంలో త్రిమూర్తుల అందరూ గోలోకవాసి అయినా శ్రీకృష్ణుని కొలవడానికి రాగా శివుడు ముగ్ధమనోహరంగా రాగాలాపన చేసి ఆరాధిస్తాడు. ఆ అద్భుతమైన సమయంలో శ్రీకృష్ణుడు రాధ తన్మయత్వంతో ద్రవరూపంలో మారి పులకరిస్తారు. ఆ అవతారమే గంగ అవుతుంది. త్రిమూర్తులు శ్రీకృష్ణుని సాక్షాత్కరించమని ప్రార్ధించగా వారికి మామూలుగా కనబడతారు. ఆ ద్రవరూపం ఒక దేహం తీసుకోగా ఆవిడకు గంగ అని పేరు పెడతారు. ఆవిడ ఒకానొక కారణంగా గోలోకం నుండి వైకుంఠ చతుర్భుజ నారాయణుని సేవకు పంపబడుతుంది.
అక్కడ వైకుంఠములో ఒకానొక వ్యాజ్యం వలన గంగ, సరస్వతి కలహించుకుని ఒకరినొకరు నదులుగా మారిపొమ్మని శపించుకుంటారు. సరస్వతి భూలోకంలో కొన్నేళ్లు నదీరూపంగా ఉండి అటుపై అంతర్వాహినిగా ఉంటూ బ్రహ్మలోకంలో స్థిరంగా ఉండేట్టు వరం పొందుతుంది. వీరి కలహం మధ్యలో కలుగజేసుకున్నందుకు లక్ష్మిని ఒక చెట్టు రూపంగా ఉండమని గంగ శపించగా ఆవిడ తులసి అవతారంగా భూమిపై అవతరిస్తుంది. అందుకే శ్రీహరికి తులసిమాల ప్రాణప్రదం. స్థూలంగా లక్ష్మీదేవి శ్రీవిష్ణు హృత్కమలమందు స్థిరంగా ఉన్నా ఆవిడ అందరినీ ఉద్ధరించడానికి బృందగా తులసి గా మన ఇంట్లో ఉంటూ ఉన్నది. ఇక కోపంగా అందరినీ శపించిన కారణంగా గంగను మూడులోకాలలో ఉండమని చెబుతాడు స్వామీ.
ఆవిడ శ్రీవిష్ణుపాదాలను శరణుజొచ్చి అక్కడ ఉంటుంది. అటుపై భగీరధుడు ఎంతో ఏకాగ్రతతో శ్రీహరిని కొలిచి గంగమ్మను భువిపైకి పంపమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీహరి ఆజ్ఞను అనుసరించి ఆయన పాదాలనుండి ఉద్భవించిన గంగమ్మ భూమిపై రాగోరగా భూమి ఆ భారాన్ని భరించలేదన్న కారణంగా బ్రహ్మ సలహామేరకు శివుణ్ణి ప్రార్ధించి ఆయన అనుగ్రహంతో గంగను ఆయన భరించేవిధంగా వరం పొంది గంగమ్మను భువికి రమ్మని ప్రార్ధిస్తాడు. గంగమ్మ కొంత గర్వించి ఎంతో వేగంగా శివుని పైకి ఉడుకుతుంది. అన్నీ గ్రహించిన శివుడు తన జటాజూటంలో ఆ గంగమ్మను బంధించగా తన గర్వభంగం అయిన పిమ్మట భగీరథుని ప్రార్ధన మేరకు గంగను భువిపైకి వెళ్ళడానికి అనుజ్ఞ ఇస్తాడు. విష్ణు పాదం నుండి ఉద్భవించి శివుని జటాజూటంలో పునీతమైన గంగమ్మ అందరి పాపాలు కడగడానికి వచ్చింది. తన ప్రవాహానికి జహ్నుమహర్షి ఆశ్రమం ఆక్రమించగా ఆయన గంగను మొత్తం ఆచమనం చేస్తాడు. మరల భగీరథ ప్రార్ధన మేరకు ఆయన చెవినుండి గంగను వదలడం వలన ఆవిడ జాహ్నవి అయింది.
శ్రీమద్రామాయణ ఇతిహాసంలో గంగ హిమవంతుని పెద్ద కుమార్తెగా జన్మిస్తుంది. ఆవిడకు చెల్లెలుగా సాక్షాత్తు అమ్మవారు పార్వతిదేవిగా అవతార స్వీకారం చేస్తుంది. అటుపై ఘోరతపం ఆచరించి ఆవిడ శివుడిని వివాహమాడింది. శివపార్వతుల కలయిక వలన పుట్టిన ఆ అండాన్ని అగ్నిహోత్రుడు భరించలేక గంగమ్మ కు అందించగా ఆవిడ శరవణ తటాకం వద్ద రెల్లు పొదలలో ఉంచగా ఆ శరవణుడు పుడతాడు. ఆ పుట్టిన శరవణుని కృత్తికలు స్తన్యమిచ్చి కాపాడగా ఆరుముఖాలతో కార్తికేయుడు దేవసేనాధిపతిగా ఎదిగి దేవతలను, లోకాలను కాపాడతాడు.
పూర్వం ఒకానొక సమయంలో మహాభిషుడు అన్న రాజు ఎన్నో యజ్ఞాలు చేసి దేవతలను మెప్పించి వారికి సహాయం చేసి బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ సభామర్యాదను మరచి అదే సభలో ఉన్న గంగమ్మను చూసి మోహిస్తాడు. అన్నీ తెలిసిన జగన్నాటక రచయిత అయినా చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిడను, మహాభిషుని భూమిపై అవతరించామని శపిస్తాడు. ఆ మహాభిషుడే శంతన మహారాజుగా జన్మించి గంగ ద్వారా అష్టవసువులను కొడుకులుగా కని ఏడుగురిని పోగొట్టుకోగా, ద్యు అనే వసువు మాత్రమే దీర్ఘకాలం ఉండవలసిన కారణంగా అతడిని భీష్ముని రూపంలో కంటాడు. అందుకే ఆ భీష్ముడు గాంగేయుడు అయ్యాడు. గంగమ్మ తీసుకున్న ఒక అవతారంగా కారణంగా ఆవిడ మానవ రూపంలో శంతనుని సఖి అయి మహాభారతాన్ని నడిపిస్తుంది.
ఇక్కడ గంగమ్మను మనం మనకున్న మానవ దృష్టితో చూడటం మూర్ఖత్వం. ఈ సృష్టికి కారణభూతుడైన ఆ పరమాత్మ అనుజ్ఞ మేరకు ఒకొక్కరికి ఒకొక్క కార్యం అనుగ్రహింపబడుతుంది. గంగ త్రిపథగ, త్రిలోకాలను పుణ్యవంతం చేస్తున్నది. సాక్షాత్తు విష్ణుస్వరూపిణి. మానవమాత్రులమైన మన పాపపంకిలాన్ని సమూలంగా నాశనం చెయ్యగలదు. రోజూ హిమాలయాలనుండి ముక్తిధామాలను స్పర్శిస్తూ కాశీక్షేత్రాన్ని పావనం చేస్తూ అందరినీ అనుగ్రహిస్తూ విష్ణు స్వరూపమైన సముద్రునిలో కలుస్తుంది. ఆవిడ గురించి తలుచుకుంటే చాలు పాపాలు పటాపంచలమవుతాయి.
మొన్న ఒక కొండ గొర్రె ఇలా కామెంట్ పెట్టాడు: " శంతనుని ద్వారా భీష్ముని కన్న గంగమ్మ శివునికి ఎలా సతి అయ్యింది? ". ఈ పనికిమాలిన చదువురాని మొద్దు దద్దమ్మలకు ఏమీ తెలియవు, అర్ధం కావు కానీ వాళ్ళు చదివే అశుద్ధమే అన్ని చోట్లా ఉంటుందని భావిస్తారు. అన్నీ కేవలం భౌతికమైన దృష్టితో మాత్రమే చూసి కొంచెం పైనున్న విషయాలు అర్ధం చేసుకోలేని మర్కటమెదళ్ళు ఇటువంటి వదరుబోతు వ్యాఖ్యలు చెయ్యడం కద్దు. దానికి సంబంధించి పురాణాలు చెప్పిన విషయాలను క్రోడీకరించి రాస్తున్నది ఈ పోస్ట్
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వము శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!