15/10/2013
సాక్షరభారతిలో అవినీతి గబ్బు..
అక్షరాస్యతా కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో చేపట్టిన ఘనత ఒకప్పుడు మన దేశానికే దక్కింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. 80వ దశకంలో ప్రారంభించిన అక్షరాస్యతా కార్యక్రమానికీ, మన్మోహన్‌సింగ్ హయాంలో ప్రారంభించిన సాక్షరభారతికి అసలు పోలికే లేకుండా పోయింది.
80లలో ఉద్యమ స్ఫూర్తితో అక్షరాస్యతా కార్యక్రమం
80వ దశకంలో అక్షరాస్యతా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడో ఎందరో ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంతో నిరక్షరాస్యులు గుండెలను తట్టారు. వారిని మేలుకొల్పారు. అక్షరగంధానికి నోచుకోలేని అభాగ్యుల దగ్గరకు వెళ్లి, రాత్రిపూట ఓనమాలు నేర్పారు. నాలుగు అక్షరాలు నేర్చుకోవాలనే బలమైన కోరికను రగిలించారు. ఎందరో వాలంటీర్లు నయా పైసా ఆశించకుండా స్వచ్ఛదంగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. పల్లెల్లో, మురికివాడల్లో అక్షర కుసుమాలు విరబూయించారు. వాటి ఫలితంగా జనంలో చైతన్యం వచ్చింది. పెద్దలు తాము రాత్రిబడుల్లో అక్షరాలు నేర్చుకోవడమే కాకుండా, అప్పటి దాకా తమతో కూలిపనులకు వస్తున్న పిల్లలను సైతం బడిలో చేర్చించారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే కాంక్షను రగిలించడంలో నాటి అక్షరాస్యతా కార్యక్రమం చాలావరకు సఫలీకృతమైంది. రాత్రి బడుల్లో చదువుకుంటున్న అమ్మలక్కల్లో కొత్త చైతన్యాలు రగిలించింది. మన రాష్ట్రంలో సారా ఉద్యమం ఉవ్వెత్తున రావడానికి అక్షరాస్యతా కార్యక్రమమే ప్రేరణ ఇచ్చింది. మరికొన్ని రాష్ట్రాల్లో క్వారీ యజమానులకు వ్యతిరేకంగా ఉద్యమాలొచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తమ జీవితాలను తామే మెరుగుపరచుకోవాలనే చైతన్యాన్ని నాటి అక్షరాస్యతా కార్యక్రమం అందించిందని ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం తెలిపారు. అదే ఆ కార్యక్రమానికి శాపమైంది. ఆ తర్వాత అక్షరాస్యత కార్యక్రమానికి ప్రభుత్వాలే తూట్లు పొడవడం మొదలుపెట్టాయి. కొంతకాలం పాటు అటకెక్కించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉద్యమాల ద్వారా చదువు చెపితే ప్రజా ఉద్యమాలు పుట్టుకు వస్తాయని దానికి మంగళం పాడరని తెలిపారు.
2009లో సాక్షరభారతి ప్రారంభం
మళ్లీ 2009 సెప్టెంబర్ 8న మన దేశంలో సాక్షరభారతి పేరుతో అక్షరాస్యతా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎన్నో ఘనమైన లక్ష్యాలు ప్రకటించిన ఈ కార్యక్రమం రూపకల్పనలో నే తప్పటడుగులు వేశారు. ఔత్సాహికుల భాగస్వామ్యం లేకుండా కేవలం అధికారుల, పంచాయతీ సర్పంచ్‌ల కనుసన్నల్లో నడిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సర్పంచ్‌ల మనుషులను వాలంటీర్లుగా నియమించి, వారికి జీతాలిచ్చి ఉద్యమ స్పూర్తికి తూట్లు పొడిచారనే విమర్శలున్నాయి.
అవినీతికి అడ్డా
ఔత్సాహికుల సేవలను ఏమాత్రమూ వినియోగించుకోలేదు. దీంతో ఈ పథకం గతి తప్పింది. అవినీతిపరులకు అడ్డాగా మారింది. ఒక్క అక్షరమూ నేర్పకుండానే పుస్తకాలు చదవడం నేర్పినట్టు రికార్డులు రాసేసుకోవడం మొదలుపెట్టారు. సాక్షరాభారతి పేరుతో వయోజన విద్య అధికారులు, కార్యకర్తలు, బుక్ పబ్లిషర్స్, ఏజెంట్లు అడ్డగోలుగా డబ్బులు నొక్కేశారు. కోట్లాది రూపాయలు మెక్కి, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కాగ్ రిపోర్టే బయటపెట్టింది. వరుసగా రెండేళ్లు కాగ్ రిపోర్ట్ సాక్షరభారతిలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టినా దానిని సరిదిద్దిపనే ప్రభుత్వం చేయడం లేదు. కాగ్ రిపోర్టు ద్వారా ఇది బోగస్ కార్యక్రమం అని బయటపడిందని ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు.