16/07/2026
#సమస్యలు పట్టని పాలకులు
#కేంద్ర విద్యశాఖ మంత్రి రాజీనామా చేయాలి
#ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్
#రాష్ట్ర సర్కారు పెండింగ్ ఫీజులు చెల్లింపులు చెయ్యకపోతే విద్యార్ధుల చదువులు కొనసాగేదెలా?
ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్
#హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పట్టని పాలక వర్గాలు ఉన్నాయని, నీట్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటని, 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేల కస్టర్ గా తగ్గించడం కాదని, ఉన్నా ప్రభుత్వ బడుల సమస్యలు పరిష్కరించాలని, ఫీజు బకాయిలు విడుదల చేయకుంటే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ హెచ్చరించారు.
గురువారం హైదారాబాద్ హిమాయత్ నగర్ లోని మగ్ధూం భవన్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, అతిథిగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్ హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నూతన విద్యావిధానం పేరుతో విద్య కాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పోరేటీకరణ, వ్యాపారీకరణకై కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. దానిలో వికసిత్ భారత్ శిక్షా అదిష్టాన్(విబిఎస్ఎ) బిల్లు -2025 పేరుతో యూనివర్శీటీలను దెబ్బతిసి ఉన్నత విద్యకు పేద వర్గాలను దూరం చేస్తోందని, విబిఎస్ఎ బిల్లు, యూజీసీ నూతన మార్గదర్శకాలు రాజ్యంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఈ విధానాలు ప్రభుత్వం విద్య వ్యవస్థను ధ్వంసం చేయడానికి, ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నవారినే యూనివర్శీటీలలో నియమాకాలు చేయడానికి తీసుకుంటున్న చర్యలని అయన ఆరోపించారు. విశ్వవిద్యాలయాలలో ఆరెస్సెస్ ఎజెండా అమలుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నీట్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ దేశ వ్యాప్తంగా విద్యార్థులంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాల్సిందేనన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా ప్రజల సమస్యలపై పోరాడే వారిపై విభజించే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అయితే ఈసారి దేశ యువత, ముఖ్యంగా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ విధానాలను గట్టిగా ప్రశ్నిస్తున్నారని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం, మరోవైపు విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాల కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిబిఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు, పోర్టల్ లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. టెండర్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, గతంలో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఒక సంస్థ పేరు మార్చుకుని మళ్లీ టెండర్ పొందిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి), పరీక్షల కేంద్రీకరణ విధానాల వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, నీట్‌తో పాటు కేంద్ర విద్యా విధానాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకున్న ఆయన విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు, కేంద్ర ప్రభుత్వం అవలభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి, యువజన సంఘాలు దేశవ్యాప్తంగా క్యాంపస్‌లలో ఆందోళనలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు నేటికీ విద్యా శాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరమని, ఈ దేశానికి రేపటి భావి భారత పౌరులు విద్యార్థులే కాబట్టి వాళ్లకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్ని కల్పించాలన్న వారి సమస్యల పరిష్కారం కావాలన్నా విద్యాశాఖ మంత్రి అనే వాళ్ళు ఉండాలి కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న సమస్యలను పరిష్కరించకపోవడం చాలా విచారకరమని అన్నారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో విద్యారంగ సమస్యలు "ఎక్కడ వేసినా గొంగడి అక్కడే" అన్న చందంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల కస్టర్ గా చేసి పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. నేడు రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డీఈవో, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదని అన్నారు. అదేవిదంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంపై అంతర్యం ఏమిటనే ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి పది వేయిల కోట్ల పైగా స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ విద్య విద్యార్థులకు తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని వారు అన్నారు. అదేవిధంగా 27 వేయిల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల కస్టర్ గా చేసే ఆలోచనలు విరమించుకోని,
ముందు ఉన్నా ప్రభుత్వ బడుల సమస్యలు పరిష్కరించాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను అరికట్టాలని, నూతన జాతీయ విద్యా విధానం 2020ని రద్దుచేసి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి తీర్మానం పంపాలని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటికాల రామక్రిష్ణ, గ్యార నరేష్, బానోత్ రాఘురాం, రహమాన్, చిట్యాల రాజు, బాలసాని లెనిన్, రాష్ట్ర సమితి సభ్యులు ఎం. చైతన్య కుమార్, మచ్చ రమేష్, ముదిగొండ మురళీకృష్ణ, ఎండీ అన్వర్, అనిల్, బాషబోయిన సంతోష్, ల్యాదల్ల శరత్, శాంతి కుమార్, వరక అజిత్, జోసెప్, ఉదయ్, సాగర్, ప్రేమ కుమార్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.