18/08/2026
హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే. కేశవరావు గారి అధ్యక్షతన, వారి నివాసంలో కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజాసంఘాలు, సబ్బండ వర్గాల ప్రతినిధులతో కమిటీ పలు దఫాలుగా సంప్రదింపులు జరిపింది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ వర్గాల నుంచి వారి అనుభవాలు, అభిప్రాయాలు, సలహాలు, సూచనలను కమిటీ స్వీకరించింది. ఉద్యమ స్వరూపం, వివిధ దశల్లో ప్రజల భాగస్వామ్యం, ఉద్యమకారుల గుర్తింపునకు అవసరమైన ప్రమాణాలు తదితర అంశాలపై వచ్చిన సూచనలను సమావేశంలో సమీక్షించారు.
స్వీకరించిన సలహాలు, సూచనలతో పాటు ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి, త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారితో కమిటీ సమావేశం కానుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారుల సేవలను సముచితంగా గుర్తించి, పారదర్శకంగా, సమగ్రంగా గుర్తింపు కల్పించేందుకు కమిటీ కట్టుబడి ఉంది.
_______________________