21/08/2024
పెళ్లికి ముందు మీరివి తెలుసుకుంటే మంచిది.
1. మీరు పెళ్లెందుకు చేసుకుంటున్నారో అన్న ఆలోచన లేకుండా సిద్ధం అయిపోయినట్లే అవతలి వాళ్లు కూడా సిద్ధం అయిపోతారు లేదా చేయబడతారు.
2. మీకెలా అయితే బలాలు బలహీనతలూ ఉంటాయో అవతలివాళ్లకి కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల సంచులు మోసుకొస్తారు. ఆ సంచుల్లో అలవాట్లు, అగచాట్లు, పొరపాట్లు, పోగొట్టుకున్నవి, ఆశలు, అత్యాశలు ఇలా ఎన్నో. పెళ్ళికిముందే ఆ సంచిలో ఏముందో పూర్తిగా తెలుసుకోవడం కుదరదు. అలాగే ఎవరూ సంపూర్ణం కాదు. ఎవరి లోటుపాట్లు వాళ్లకుంటాయి.
3. మీరు చదువు, ఉద్యోగం, ఎత్తు ఇలా ఒక పది అంశాల చిట్టా పట్టుకుని తిరిగితే అందులో కనీసం ఆరు ఉన్నవాళ్లని వెంటనే కట్టేసుకోవాలి. పదికి పదీ కావాలి అని పట్టుబడితే పెళ్లికాకుండానే కాటికెళ్లిపోతారు. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే, మనకి కావాల్సిన పదికి పది ఉన్నవాళ్లు మనల్నెందుకు చేసుకుంటారు అన్న ఆలోచన వస్తుంది.
4. భార్య/భర్త అందం ట్రోఫీ కాదు అందరికీ చెప్పుకోడానికి, నీకు నచ్చితే చాలు అందరికీ నచ్చక్కర్లేదు. అలాగే మీ సంపాదన మీకుంటే మంచిది.
5. పెళ్లి కుదిరిన దానికీ/ నిశ్చితార్థానికి , పెళ్లికీ మధ్య కొన్ని నెలల సమయం ఉండాలి. ఆ సమయంలో ఇరువురూ మాట్లాడుకోవడం, వీలైతే కలిసి బయటికెళ్లటం, సరదాగా తిరగటం, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం చెయ్యాలి. ఇది బంధాన్ని బలపరచడానికి ఒకరిగురించి ఒకరు తెలుసుకోడానికి, అభిరుచులు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
6. కాబోయే భార్య/భర్తలో మనకి నచ్చని విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని అది వారి వ్యక్తిత్వం అని వదిలేస్తారో, లేక సౌమ్యంగా చెప్పి మారుస్తారో, లేక తాడో పేడో తేల్చుకుంటారో అన్నది పూర్తిగా మీమీదే ఆధారపడి ఉంది. కానీ పెళ్లైన చాలా ఏళ్లకి ఇవి పూర్తిగా మారిపోవటం కానీ, లేదా అసలు ఇబ్బంది కలిగించనంతగా అలవాటు పడిపోవడం గానీ జరుగుతుంది.
7. పెళ్ళైన తర్వాత కచ్చితంగా రెండు మూడేళ్లు రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది. భయపడకూడదు, అది కూడా ఆనందించాలి. ఆ కల్లోలంలో వైవాహిక నావని మీరెలా దిక్సూచి లేకుండా నడుపుతారు అన్న దాని బట్టి మీ దాంపత్య జీవితం
ఆధారపడి ఉంటుంది.
8. పెళ్లికి ముందే అన్ని విషయాలూ నిర్ణయించడం వాటికి కట్టుబడి ఉండటం కుదరదు. ఉదా ఎంతమంది పిల్లలు, ఎక్కడ స్థిరపడాలి లాంటివి. ఇదేమీ రాసింది రాసినట్లుగా ఎక్సిక్యూట్ అవ్వటానికి సాఫ్ట్వేర్ కోడ్ కాదు.
9. ప్రతి వ్యక్తికీ కొన్ని విలువలు, నమ్మకాలు, ఆదర్శాలు, అభిప్రాయాలు ఉంటాయి. అవి మీకు నచ్చకపోవచ్చు లేదా వాటితో విభేదించవచ్చు. దానిని మీరు ఎదుటివారికి వ్యక్తపరచవచ్చు కానీ కాదు కూడదు అనే అధికారం లేదు.
10. ఎన్ని ఎక్కువ సంబంధాలు చూస్తే అంత విసుగొస్తుంది. ప్రతి ఒక్కరికీ పెళ్లికి సంబంధించి ఒక అనువైన సమయం (వయసు, అందం, కోరిక మొదలైనవి) ఉంటుంది. అది దాటాక, చేసుకుంటే ఏదో ఒకటి అవ్వగొట్టాం అని అనిపిస్తుంది కానీ అందులో ఆనందం తగ్గిపోతుంది.
11. పెళ్లి అనేది ఒక పెద్ద జూదం, ఇందులో అనుభవం లేకుండా మీరు ఆడటానికి వెళతారు. ఈ ఆటని నెగ్గాలి అని కాకుండా ఆనందించాలి, ఎత్తుపల్లాలు చూడాలి, ఎక్కువసేపు ఆడవలసి వస్తుంది అని సిద్ధమై వెళ్లినవాళ్లే విజయం సాధిస్తారు.
12. పెళ్లయ్యాక ఎలా ఉండాలి అని ఎవరూ నేర్పరు. పెళ్లయ్యాక ఎడాపెడా ఊరికే అడగకుండా సలహాలిచ్చేవాళ్లని ఎంత దూరంగా ఉంచితే మంచిది. అది అమ్మానాన్నైనా, స్నేహితులైనా ఇంకెవరైనా. మీకేదైనా సమస్య వస్తే ముందు మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి.
13. మీరు బంధంలో ఎప్పుడూ పైచేయి కోసం ప్రయత్నించకూడదు. మీ బలహీనతలు మీరు ఎదుటివారికి బయల్పరచడం ద్వారా వారి విశ్వాసాన్ని తద్వారా వారి మద్దతుని పొందగలరు. మీరేంటో మీ భాగస్వామికి తెలీకపోతే వాళ్లు మీకు మానసికంగా దగ్గరకాలేరు.
14. పెళ్లిలో శృంగారం అనేది సహజమైనది. ఇందులో ఒకరి కోరికలకు ఇంకొకరు ప్రాధాన్యతని ఇవ్వటం ముఖ్యం. అసహజం కాని ఏ శృంగార చర్యనైనా మీరు నిరభ్యంతరంగా చెయ్యవచ్చు.
15. పెళ్లయ్యాక ఒకరికిఒకరు, ఇంకా తల్లిచాటు కొడుకు, తండ్రిభుజాన కూతురు అంటే కుదరదు. మీరు ఈ మార్పుని ఎంత త్వరగా గుర్తించి భర్త/భార్య పాత్రలో ఒదిగిపోతారో అంత త్వరగా మీ బంధం బలపడుతుంది. హక్కులకంటే బాధ్యతల కోసం పాటుపడేవాళ్లకే దీర్ఘకాలిక ఆనందం.
16. పెళ్లికి ముందే హింసాప్రవృత్తిని అంచనా వేయాలి. వంచన, ద్రోహం, గోప్యత, మాటమార్చటం, అబద్ధాలు, దుర్వ్యసనాలు ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి. ఆస్తులు, డబ్బు కాదు. ఆరోగ్యం గురించి కనుక్కోవడంలో తప్పులేదు. ప్రతిఒక్కరిలో ఒకటీ అర ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవేమీ పెళ్లికి అడ్డంకి కాదు. ఒకసారి సదరు వైద్యులతో మాట్లాడితే సందేహాలు తీరిపోతాయి.
చక్కగా సమయానికి పెళ్లి చేసుకోండి, కిందమీదా పడి కొట్టుకోండి, కలిసి శ్రమించండి, కలిసి సాధించండి, కలిసి ముసలివాళ్లైపోండి.