28/03/2017
యేసుక్రీస్తు జనించిన నాటి నుండి మరణించు వరకు అనగా సిలువ మీద చనిపోయి, తిరిగి లేచి పరలోకం వెళ్ళేంత వరకు ఈ ఏడు మాటలతో పాటు అనేక ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడాడు.వాస్తవానికి యేసుక్రీస్తు జ్ఞానానికి నిలువెత్తిన నిర్వచనం. జ్ఞానియైన, మహాశక్తియైన యేసుక్రీస్తు ఒక వ్యక్తిగా ఈ భూమి మీదకు వచ్చి పలికిన ప్రతి మాట సర్వ మానవాళికి అవసరమే కాక అత్యవసరం అని చెప్పక తప్పదు. ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు మాటలంతటిలో అతి ప్రాముఖ్యమైన ఈ ఏడు మాటలలోని పరమార్ధాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నేర్చుకుందాం.ఆచరణచేద్దాం.
మన భారత జాతి పిత గాంధీ గారికి మహాత్మ అను బిరుదు కలదు. ఒక సాదారణమైన వ్యక్తిగా జన్మించిన గాంధీ గారికి అంతటి మహాత్ముడుఅను బిరుదు ఎలా పొందుకున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడి అను యేసుక్రీస్తు సిలువపై పలికిన ఈ మాటకు ప్రభావితుడై తనను కాల్చిన గాడ్సేను క్షమించుట వలననే. ఆనాడు సిలువలో యేసును చంపువారిని “క్షమించుడి” అను మాటను 2000 సంవత్సరాల తరువాత గాంధీ గారి నోట వినగానే మన భారతీయులు ఆశ్చర్యపోయి చివరికి మహాత్ముడు అను బిరుదుతో సత్కరించిరి. వాస్తవానికి గాంధీ గారు మహాత్ముడు కావుటకు యేసుక్రీస్తు అనే మహాత్ముడు మార్గదర్శియై ఉండుట బట్టియే. గాంధీ గారిని మహాత్మునిగా చేసిన మాటయే ఈ మొదటి మాట.
లూకా23:34- యేసు- తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.
ఈ మాటను ఎవరి గూర్చి, దేన్ని ఉద్దేశించి తండ్రికి ప్రార్దిస్తున్నాడు? ఏయూదులైతే అనగా ఏ ఇశ్రాయేలియులైతే క్రూరముగా సిలువ శిక్షకు అప్పగించారో, ఎవరైతే ఆయనను పిడుగుద్దులు గుద్దుతున్నారో, ఎవరైతే అయన మీద ఉమ్మి వేస్తున్నారో, ఎవరైతే అయన తలకు ముండ్లకిరీటం పెట్టారో, ఎవరైతే తన చర్మాన్ని కొరడాలతో చీల్చేసారో వారందరి గూర్చి, వారందరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటయే ఈ మొదటి మాట. పాపమే ఎరుగని యేసుక్రీస్తు పాపములో మునిగి తెలుతున్న పాపుల పక్షాన తండ్రిని క్షమించమని ప్రార్ధిస్తున్నాడు.
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అను మాటలోని పరమార్ధం ఏంటి? తన చుట్టు ఉన్నవారు తనపై చేస్తున్నది వారికీ తెలియదా? ముమ్మాటికి తెలుసు. మేము యేసును అపహసిస్తున్నామని అపహసిస్తున్న వారికీ తెలుసు. మేము యేసుకు అన్యాయపు తీర్పు తీరుస్తున్నామని అన్యాయపు తీర్పునిచ్చిన వారికి తెలుసు. ఏ తప్పు చేయని యేసుకు మేము సిలువ వేస్తున్నామని సిలువను వేస్తున్న వారికీ తెలుసు. యేసుయొక్క వస్త్రములు పంచుకుంటున్న వారికి మేము యేసు వస్త్రములే పంచుకుంటున్నామని తెలుసు. పై సందర్బాలను గమనిస్తే వారు చేస్తున్నది వారికి తెలిసియున్నది కానీ వారికీ తెలియని ఒక విషయాన్ని గూర్చి వీరేమి చేయుచున్నారోవీరెరుగరు అను మాటను పలికాడు. లేఖనాలలో ముందుగా వ్రాయబడిన సంఘటనలన్నిటిని మేము నేరవేరుస్తున్నామన్న సంగతి సిలువ వేసిన వారికిని, అన్యాయపు తీర్పు తీర్చిన వారికి తెలియదు. అనగా ముందుగానే లేఖనాలలో వ్రాయబడినది మేము నెరవేరుస్తున్నామన్న విషయము వారికి తెలియదు.
కీర్తనలు 22:18- నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు
యోహాను 19:23,24- సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి.ఆయన అంగిని కూడ తీసుకుని , ఆ అంగికుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు-దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను
కీర్తనలు 22:7- నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్నుఅపహసించుచున్నారు
లూకా 23:35-ప్రజలు నిలువబడి చూచు చుండిరి.అధికారులును- వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్ను తాను రక్షించుకోనుమని అపహసించిరి
యెషయా 53:12-అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను
మార్కు 15:27-మరియు కుడివైపున ఒకనిని ,ఎడమ వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడ సిలువ వేసిరి( ఫుట్నోటులోచూస్తేఅప్పుడు ఆయన అక్రమకారులలో నొకడుగా నెంచబడెనని చెప్పు లేఖనము నెరవేరినది)
యెషయా 53:8-ఆన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను
ఇలా సిలువ సందర్భంలో జరిగిన ప్రతిది కూడ లేఖనాల ప్రకారం జరుగుతుంది కానీ నెరవేరుస్తున్న వారు మాత్రం మేము లేఖనాలను నెరవేర్చుటకు ఇలా చేస్తున్నామని తెలియదు. అపో కార్య 13:26- యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములనునెరవేర్చిరి. ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపలేదు కనుక వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అను మాటను పలికాడు. నిజానికి యేసుక్రీస్తు ఈ మాటను పలుకకపోతే తన చుట్టూ ఉన్నవారు అనగా లేఖనాలు ఎరుగక ఆయనను శిక్షిస్తున్న వారందరు నరకానికి దిగజారిపోదురు కనుక క్షమించుమని తండ్రికి ప్రార్ధిస్తున్నాడు.
క్రీస్తుకుకలిగియున్న ఇంతటి గొప్ప క్షమించే మనస్సు మనలో ఉన్నదా? గలతీ 3:27- క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరును క్రీస్తును ధరించియున్నారు. మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరు క్రీస్తును ధరించిన వారే.క్రీస్తును ధరించుట అనగా ఏమి? క్రీస్తు మనస్సును ,గుణగణాలను మన బ్రతుకులో ధరించుకొనుటయే( పాటించుటయే, కనపరుచుటయే). క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు క్రీస్తులా క్షమించాలి. నేడు క్షమించే క్రైస్తవులు సమాజములో ఎంత మంది ఉన్నారు? కళ్ళ ముందు ఒక వ్యక్తి వలన నీకు అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయం చేస్తున్న వ్యక్తిని ఆదే క్షణములో క్షమించే మనస్సు నీకు ఉందా? అంతటి గొప్ప క్షమా గుణం నానాటికి క్రైస్తవ్యములో కనుమరుగౌతుంది.
మనల్ని హింసిస్తున్నవారిని, దుషిస్తున్నవారిని, హేళన చేస్తున్నవారిని,వ్యతిరేకిస్తున్న వారిని క్షమించి వారి మార్పు కొరకు ప్రార్ధన చేయబద్దులమైయున్నాము. క్రీస్తును ధరించిన ప్రతి ఒక్కరు ఆయనలా ఇతరులను క్షమించే మనస్సు కలిగియుండాలి.క్రీస్తులేని క్రైస్తవులు, క్రీస్తు మనస్సు ఎరుగని క్రైస్తవులు, క్రీస్తును ధరించుకోననిక్రైస్తవులు, క్రీస్తు లక్షణాలు లేని క్రైస్తవులు క్రైస్తవ సమాజములో ఉండుట భాదను కలిగించే విషయమే. వాస్తవానికి క్షమించండి అను మాట నోట నుండి ఉచ్చరించుట బహు సులువు కానీ క్షమించుట చాలా కష్టము. కష్టమైనను కూడ తన అడుగుజాడల యందు మనంనడవాలని క్షమించిన గొప్ప త్యాగశిలిగా చరిత్రలో నిలిచి మనకు మాదిరియుంచిపోయెను.
1 పేతురు 2:21- క్రీస్తు కూడ మీ కొరకు భాదపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరియుంచిపోయెను.
ఆనాడుయేసును సిలువ వేసిన వారిని నేడుమనము ద్రోహులని, పాపులని తిడతూ నిందిస్తాము.అయినను అంతటి ద్రోహులను సైతంతండ్రిని క్షమించమని అడుగుచున్నాడు. మన అనుదిన జీవితములో మాటలలో,చూపులలో,వినికిడిలో,చేతలలో,ప్రవర్తనలో,నడతలో,తలంపులలో, ఉహలలో ,ఆలోచనలో ఇలాఎక్కడో ఒక చోట తప్పు చేస్తూ తప్పిపోతూచివరికి దేవునిని బహు వేదనను గురిచేస్తున్నాము. ఆనాడుసిలువ వేసిన వారు తప్పిపోతేఈనాడుమనము తప్పిపోవుచున్నాము. తప్పు వెంబడి తప్పు చేస్తున్న మనకు నిజముగా బ్రతికే అర్హత లేదు. నేటి వరకు మనము చేసిన ఘోరమైనపాపాలకు శిక్ష పడాలి కానీ ఎందుకు దేవుడు మనల్ని క్షమించి దిన దినము సజీవులుగా ఉంచుతున్నాడు? ఎందుకు దేవుడు మనఅయుష్షును దిన దినము పోడిగిస్తున్నాడు?ఎందుకు దేవుడు ఇంకా మనకుబ్రతుకునిస్తూ కొనసాగిస్తున్నాడు? ఈ రోజు మనంఇష్టానుసారముగాజీవిస్తున్నామంటే మన బ్రతుకు వెనుక యేసుక్రీస్తు ప్రార్ధన ఉందని మర్చిపోకూడదు. తప్పు వెంబడి తప్పు చేస్తున్న, చేయకూడని పాపం చేస్తున్న, ఇష్టం వచ్చినట్టు బ్రతికిన , దేవుని ఇష్టాన్ని జరిగించకపోయిన, దేవుని కోసం బ్రతకక పోయిన , మన ఇష్టాలను నేరవేర్చుకుంటున్న నేడు సజీవులుగా ఉన్నామంటే కారణం మన వెనుక త్యాగమూర్తి యేసుక్రీస్తు చేస్తున్న విజ్ఞాపన వలననే అని మర్చిపోకూడదు.
రోమా8:34- దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడునుమన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే.
నాడు సిలువ వేసిన వారి కొరకు విజ్ఞాపన చేయడమే కాక నేడుమన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాడుచంపుతున్న వారి కొరకు తండ్రిని క్షమించమని విజ్ఞాపన చేసాడో అదే యేసుక్రీస్తు ఈనాడు పరలోకములోమన పక్షాన కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. నేటి వరకు మనము చేస్తున్న తప్పులకు,మనము పడిపోతున్న బలహీనతలకు శిక్ష అనుభవించవలసిన వారమైయుండగా, ఆ శిక్ష మన మీద పడకుండా మన గురించి తండ్రికి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమంటూన్నాడు. నేడుమనం సజీవులుగా ఉన్నామంటే దాని వెనుక పరలోకపు తండ్రి కుడి పార్స్యమున చేరిమన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు గనుకనే.
పాపమే చేయని పరిశుద్దుడైన యేసుక్రీస్తు పాపులను క్షమిస్తే అను నిత్యం ఏదో ఒక పాపం చేస్తున్న మనం ఇతరులను క్షమించలేకున్నాము. పాపి అంటే యేసుక్రీస్తుకు ఇష్టం- పాపమంటే యేసుక్రీస్తుకు అసహ్యం. పాపిని ప్రేమించాడు-పాపాన్ని ద్వేషించాడు.
2 కోరంది 2:10-మీరు దేని గూర్చియైననుఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను
మత్తయి 6:14-మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును
మత్తయి 18:35- మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యెడలనా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయుననేను.
కొలస్సి 3:13- ఎవడైనను తనకు హనిచేసేనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులగున మీరును క్షమించుడి
ఎఫేసి 4:32- ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి
మత్తయి18:21,22-ఆ సమయమున పేతురు అయన యొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసిన యెడల నేనెన్ని మరులు అతని క్షమింపవలెను?ఏడు మారుల మట్టుకా? అని అడిగెను. అందుకు యేసు- ఏడు మరులు మట్టుకే కాదు,డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను
లూకా 6:38- క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు
లూకా 17:3- నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని గద్దించుము;అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము
యోహాను 20:23- మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికీ క్షమింపబడును
పాపిని ప్రేమించి, క్షమించి పాపాన్ని ద్వేషిస్తూ క్రీస్తుకున్న ఈ మనస్సును మనము కలిగియుందాము. చేసిన తప్పును, పాపమును సాధ్యమైతే వారికీ తెలియజేసి సత్యము చెప్పు- సత్యం వినిపించు-సత్యం అర్థం చేయించు-సత్యప్రకరం మనం నడుస్తూ వారిని నడువుమని చెప్పు.
సమస్త మహిమ దేవునికే కలుగును గాక, ఆమెన్