07/11/2023
మానసిక యుద్ధం (సైకలాజికల్ వార్‌ఫేర్) అంటే ఏమిటి?.........................
ఒక రాజుకు దుర్దశ దాపురించి ఆయన వద్దనున్న అష్ట లక్ష్ముల్లో అందరూ వెళ్లిపోయే స్థితి వచ్చిందట. రాజు అందరు లక్ష్ములూ వెళ్లిపోయినా ఫర్వాలేదు కానీ ఒక్క ధైర్య లక్ష్మి ఉంటే చాలని కోరుకున్నాడట. ఆవిడ ఉంది. ఈ వెళ్లిన ఏడుగురు లక్ష్ములకు ధైర్య లక్ష్మి లేక భయం ఆవహించిందట. ఎలా వెళ్లారో అలానే రాజు వద్దకు వచ్చేశారు. ధైర్యం అంత గొప్పది అని నీతి చెప్తారు. ఈ నీతి యుద్ధంలోనూ పనికివస్తుందని ఆధునిక, ప్రాచీన, మధ్య యుగాల నాటి యుద్ధాలు అనేకం నిరూపించాయి.
యుద్ధంలో భౌతికమైన బలిమి కన్నా మానసికమైన బలం చాలా కీలకం. ధైర్యం, ఉత్సాహం ఉన్న సైన్యం తనకన్నా మూడింతలు బలం ఉండీ, ఈ ధైర్యం లోపించిన సైన్యాన్ని దెబ్బతీస్తుంది. "In war, morale forces are to physical as three to one" అన్నాడు నెపోలియన్.
మానసికమైన ఎత్తుగడలతో శత్రువును దెబ్బతీయడం, యుద్ధాన్ని తమవైపుకు మలుచుకోవడం - మానసిక యుద్ధం.
ఇందులో రకరకాల పద్ధతులు ఉన్నాయి, ముఖ్యమైనవి ఇవి:
ప్రచారాన్ని ఉపయోగించి శత్రువును నిరుత్సాహపరచడం, ప్రజాభిప్రాయాన్ని వాళ్ళకు వ్యతిరేకంగా మలచడం వంటివి
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి భయపెట్టడం, ఒత్తిడికి గురిచేయడం
ప్రపంచ చరిత్రలో
రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ చేసిన అబద్ధపు ప్రచారం చాలా ప్రభావవంతమైనదని చెప్తారు. హిట్లర్ నియమించిన ప్రచార మంత్రి జోసెఫ్ గోబెల్స్ ఈ విషయంలో ఎంతగా పేరుపడ్డాడంటే ఇప్పటికీ ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే "గోబెల్స్ ప్రచారం" అని తిడతారు. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వమూ ఇందులో ఏమీ వెనుకబడలేదు. వాళ్ళూ ప్రచారం సమర్థంగ చేసి మానసిక యుద్ధం చేసింది.
ఛెంఘిజ్ ఖాన్ దండయాత్రల్లో గుర్రాల తోకలకు ఏవో వస్తువులు, బట్ట వంటివి కట్టీ నేలమీదున్న దుమ్ము విపరీతంగా రేగేలా చేసేవాడట. వస్తున్న సైన్యం సంఖ్యకు పది రెట్లు సైన్యం వస్తున్న భ్రమ కలిగేది అలాగ. అలానే, రాత్రిపూట ఒక్కో సైనికుడు మూడు మూడు కాగడాలు వెలిగించి డేరాల్లో పెట్టించేలా ఏర్పాట్లు చేసేవాడు.
నెపోలియన్ ఊహించనలవి కాని వేగంతో శత్రువు మీదికి వెళ్లి, చుట్టూ తన సైన్యమే కనిపించేలా చేసి - విపరీతమైన షాక్ కి గురిచేసేవాడు. ఆ అయోమయంలో చెల్లాచెదురై, దెబ్బతినేవారు అతని శత్రువులు.
రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఈ వ్యూహంలో వేగం అన్నదాన్ని ఇంకా మెరుగ్గా అమలుచేశాడు. బ్లిట్జ్‌క్రిగ్ (Blitzkrieg) విపరీతమైన వేగం, కేంద్రీకరించిన దాడి ఉపయోగించి అవతలి సైన్యాన్నే కాక, శత్రు దేశాల కూటములను షాక్ కీ, భయానికీ లోనుచేసేవాడు.[1]
మహాభారతంలో
"అశ్వత్థామ హతః" (కుంజరః) అన్న ధర్మరాజు మాట విని కుమారుడు చనిపోయాడని భావించి ప్రాణాలు విడిచిపెడుతున్న ద్రోణాచార్యుడు; క్రెడిట్స్: రామనారాయణదత్త అస్త్రి, హిందీ గీతాప్రెస్ మహాభారతం
మహాభారతంలో చాలా సందర్భాల్లో మానసిక యుద్ధం వాడుక కనిపిస్తుంది:
ద్రోణాచార్యుడిని పడగొట్టడానికి వేరే ఏ మార్గమూ లేకపోవడంతో అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిన వార్తను ధర్మరాజుతో "అశ్వత్థామ హతః" అని బిగ్గరగా అని, "కుంజరః" అని మెల్లిగా చెప్పించారు. దానితో తన కుమారుడు అశ్వత్థామే చనిపోయాడని నమ్మిన ద్రోణుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇది మానసిక యుద్ధమే.
అర్జునుడు తన కొడుకు అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుడిని తర్వాతి రోజు సూర్యాస్తమయంలోపు చంపుతాననీ, లేకుంటే ప్రాయోపవేశం చేస్తాననీ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. సైంధవుడిని సాయంకాలం లోగా కాపాడుకుంటే అర్జునుడు తనంత తానే చస్తాడు కదా అని కౌరవ సైన్యమంతా సైంధవుడిని కాస్తుంది. సాయంత్రం కావస్తూంటుంది. సూర్యుడు కుంగినట్టు అయింది. అర్జునుడి ప్రతిజ్ఞ పోయింది. ప్రాణం దక్కింది అన్న అత్యుత్సాహంతో సైంధవుడు వ్యూహం నుంచి బయటకు వచ్చి గెంతులేస్తాడు. హఠాత్తుగా అప్పటివరకూ సూర్యుడిని కమ్మి ఉంచిన కృష్ణుడి చక్రం తొలగిపోయింది. అంటే - సూర్యాస్తమయం కాలేదన్నమాట. సైంధవుడి తలను అర్జునుడి బాణం తెగవేసింది. సైంధవుడిని బయటకు రప్పించేందుకు చేసిన మాయ కూడా మానసిక యుద్ధమే.
శల్యుడి కథ మరింత ప్రత్యేకం.
శల్యుడు మాద్రి సోదరుడు, పాండవులకు మామ. ఆయనకు గొప్ప సైన్యం ఉంది, స్వయంగా సుప్రసిద్ధుడైన రథ సారధి. ఆయన యుద్ధానికి ససైన్యంగా తరలి వస్తూండగా, ధర్మరాజులా నటించి, నమ్మించిన దుర్యోధనుడు గొప్ప విందు ఏర్పాటుచేసి, అతన్ని సంతృప్తిపరిచాడు. యుద్ధంలో "నా సాయం నీకే" అని మాట తీసుకున్నాడు. అప్పుడు చెప్పాడు తాను దుర్యోధనుడినని. శల్యుడు మాట మీరలేడు. ఇది మొదటి మానసిక యుద్ధం. ఇందులో విజయం దుర్యోధనుడిది.
"మామా! కర్ణుడికి సారధివి కమ్మని నిన్ను కోరుతారు. అంగీకరించి అతనిని యుద్ధంలో నీ మాటలతో దుర్బలుడిని చేయి" అని ధర్మరాజు శల్యుడికి చెప్పాడు. అనుకున్నట్టే శల్యుడిని యుద్ధంలో కర్ణుడికి సారధ్యం చేయమని దుర్యోధనుడు కోరాడు. దీనికి కారణం సూతపుత్రుడని అన్నవారి ఎదుటే సారధ్యంలో కృష్ణుడు అంతటివాడైన శల్యుడిని తన సారధి చేసుకోవాలని ఆశించి, దుర్యోధనుడిని అలా కర్ణుడు కోరుకోవడం. శల్యుడు కావడానికి మహా నిపుణుడైన, సుప్రసిద్ధుడైన సారధియే. కానీ, ముందే చెప్పినట్టు వంచితుడు, మనస్ఫూర్తిగా కౌరవ పక్షం వహించినవాడు కాదు. దానితో "నేను ఏ మాట మాట్లాడినా ఊరుకోవాలి" అని షరతు పెట్టి మరీ సారధ్యం చేశాడు. శల్యుడు యుద్ధం సాగుతున్నంత సేపూ కర్ణుడిని ఆ మాట ఈ మాట అని మానసికంగా దెబ్బతీశాడు. అతని మానసిక స్థైర్యాన్ని ఎప్పటికప్పుడు హరించివేసి అతని చావులో తనవంతు పాత్ర పోషించాడు. అందుకే మన పక్కనే ఉంటూ నిరుత్సాహపరిచేవారిని "శల్య సారధ్యం" అని తిడతారు. ఇదీ దుర్యోధనుడు ప్రారంభించిన ఆ సైకలాజికల్ వార్‌ఫేర్‌కి ధర్మరాజు ఎదురుదెబ్బ.
ఫుట్‌నోట్స్
[1] Blitzkrieg - Wikipedia