
మహా కవి,నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి సందర్భంగా ఏపీపీఎస్సీ ఉద్యోగ సమాచారం పక్ష పత్రికలో రెండు దశాబ్దాల నాటి నా వ్యాసం.
---------
ముప్పదిమూడుకోట్ల దేవతలెగబడ్డ దేశమున క్షుదార్తుల ....
రాజు మరణించె ఒకతార నేలరాలె - సుకవి మరణించె ఒకతార నింగికెగసె
రాజు జీవించు శిలా విగ్రహములందు - కవియు జీవించు ప్రజల గుండెలయందు --------------------------------
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ఆత్మకథాత్మక పద్యకావ్యo
"గబ్బిలము"
"కనుపడలేదు దైవతము గాని పదార్థము భారతంబునన్ గనుపడలేదు వర్ణనము కన్న మహాకళ భారతంబునన్ కనుపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్ గనుపడలేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్(గబ్బిలము)
వేద చతుష్టయంబు ప్రభవించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలుందురా! రుధిర మాంసములుం గల యంటరానివా రాదిమవాసులక్కట కటా! తలపోసిన నల్లగుండెలో సూదులు మోసులెత్తును గృశోదరీ! యెట్లు సహించుకొందునో ముసలివాడైన బ్రహ్మకు బుట్టినారు. నలువురు కుమారులనుట విన్నాముగాని, పసరముకన్న హీనుడభాగ్యుడైన యైదవ కులస్థుడెవ్వరమ్మాసవిత్రి!
(ఖండకావ్యం-2)
అస్పృశ్యతా మారణహోమానికి స్పందించిన జాషువా గుండె రాసిడిలోంచీ, హృదయాంతరాళ కల్లోలం లోంచీ పోటెత్తిన చైతన్య తరంగాలు జాషువా పద్యాలు, అసమ సమాజపు వివక్ష గుండెల్లో బాకులుదించి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయగా ప్రభవించిన అనంత విషాదంలోంచీ తలెత్తిన చైతన్యం నాటి సమాజాన్ని ప్రశ్నల వెల్లువతో ముంచెత్తి దళితులు వేదనకు పద్యరూపమిచ్చిన మహానుభావుడు
వలసపాలనలో ఏకీకృతమైన భరతఖండంలో జాతీయభావం జనించి వేళ్ళూనుకుంటున్న వేళ, కులమత విద్వేషాలు, అంటరానితనం, తీవ్రవిద్వేషాలు, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, వంటి సామాజిక రుగ్మతలతో సమాజం అతలాకుతలమౌతున్న మోఢ్యదశలో, ఆర్యసమాజం, బ్రహ్మ సమాజం, ప్రార్థనాసమాజం, వంటి సంస్థలు హిందూమత సంస్క రణకు నడుంకట్టిన వేళ, మనిషిని వీథి కుక్క కన్నా హీనంగా చూసే రోజులు నడుస్తున్నవేళ, సాంఘిక వివక్షపై జ్యోతిబాపూలే, నారాయణగురు. వంటి మహనీయుల కృషితో భారతప్రజ నూతన ఆలోచనలతో, అభ్యుదయ పథగామియైన వేళ, రైళ్ళు, తంతితపాలా వ్యవస్థలు దూరాల్ని తగ్గించే ప్రక్రియ ప్రారంభమైన వేళ తన కవితా శంఖతో జాతిని చైతన్యం చేయడానికై అనంతుడై విజృంభించాడు.
తెలుగునాట గుంటూరుసీమలో వినుకొండ లో ఆయన పుట్టేరు. గొల్ల సుద్దులంటే ఎంతో ప్రాణమిచ్చే వీరయ్య అనే యాదవ కులస్తుడు. ఆయన చదువు కోసం ABM మిషసరీ స్కూలులో చేరారు. అక్కడ ఆయనకు మంచాల గ్రామానికి చెందిన 'లింగమాంబ' తో ప్రేమ కలిగింది. ఆమె మాదిగకులానికి చెందినందున ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. మిషను యాజమాన్యాన్ని ఒప్పించడానికి వీరయ్య క్రైస్తవమతం పుచ్చుకుని ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ దంపతులు ఎదుర్కొన్న తీవ్ర నిరాదరణ వర్ణనాతీతం. ఆ ఆదర్శాల సాఫల్యాల సాహసదంపతుల కడుపుపంట 1895అక్టోబరు 28న వినుకొండలో జాషువా జన్మించారు.
ఆయన బాల్యం దుర్భర దారిద్య్రంలో కులవివక్ష, తో గడించింది. చిన్నారిబుడతడైన జాషువాకు పండుగకుతొడగడానికి కొత్తబట్టలు లేవు. తినుబండారమే పెట్టాలంటే చేతిలో చిల్లికానీ కూడాలేని ఆపేద తల్లి లింగమాంబ అప్పైనా దొరుకుతుందేమో నని బయలుదేరింది. కొడుకు తల్లితో నడిచాడు. బాలజాషువఎవరి చేతిలోంచో జారిన తినుబండారాన్ని చూసి, అమాయకంగా చేతిలోకి తీసుకుంటే కొడుకుని వారించలేక కడుపులో సుళ్ళుతిరుగుతున్న బాద ఏడుపు రూపంలో ఉబుకుతుంటే రోదనను గొంతులోనే దిగమింగిందా మాతృమూర్తి.
పంచమజాతి పిల్లలకోసం ప్రత్యేకించిన బెంచీలో, జాతిపై రోతగలిగిన పంతుళ్ళ వద్ద ఎనిమిదోతరగతి దాకా చదివి, బాపట్లలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకుని, వినుకొండ్ చాట్రపాడు గ్రామంలో 1909 నుంచీ 1911 వరకు ఉపాధ్యాయ వృత్తిచేసి, ‘మతబోధకుల అనుగ్రహం తప్పడంవల్ల' ఉద్యోగం మానుకో వలసి వచ్చింది. సహధర్మచారిణి 'మేరి'తో పొట్టకూటికై అనేక తిప్పలు పడ్డాడు. కొన్నాళ్ళు 'టూరింగ్ సినిమాథియేటర్' లలో మూగ చిత్రాలకు కథలు వినిపించే ఉద్యోగం చేశారు. తర్వాత రాజమండ్రి కోటిలింగ ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది రూపాయల నెలజీతానికి కుదురుకుని, అది కూడా మానుకు, సమాజాలకు నాటకాలు వ్రాసి, అదికూడా అచ్చిరాక గుంటూరు చేరి ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆ రోజుల్లోస్థాపించబడినిన్న మొన్నటి వరకూ నడిచిన 'భారతి' మాసపత్రికకు వ్రాయటం ద్వారా ఆయన ప్రతిభ లోకానికి వెల్లడైంది. తరువాత గుంటూరు జిల్లా బోర్డు స్కూలులో బాపట్లలో ఉపాధ్యాయ ఉద్యోగంచేరి, అక్కడి నుంచి వినుకొండ బదిలీ చేయిం చుకుని, 1942 దాకా అక్కడే తెలుగు పండితునిగా పనిచేశారు.
ద్వితీయ సంగ్రామ కాలంలో జాషువా కవితాభిమాని ఐన సానెకొమ్ము మాలకొండారెడ్డి ప్రోద్భలంతో యుద్ధ ప్రచారశాఖలో ఉద్యోగం చేసారు. ఆ ఉద్యోగ కాలంలో ఆయన దేశభక్తిని శంకిస్తూ తెలుగుదేశమంతటా దుమారం రేగింది. అయితే ఆయన
'ఉదరార్థంబు ధరించినాడమునుపెన్నోవేషముల్ మాతృశారద వంకం బెరచూపులం బఱపితిన్'
అంటూతన దృక్పధాన్ని మార్చు కున్నాడు. ఆ సమయంలోనే యుద్ధ భీభత్సాన్ని చిత్రిస్తూ 'కాందిశీకుడు' కావ్యం వ్రాశారు. ప్రముఖ జాతీయవాది తిక్కవరపు రామిరెడ్డిగారితో ఏర్పడిన పరిచయంతో నేతాజీ' 'బాపూజీ' ‘స్వయం వరం‘ అనే కావ్యాలు వ్రాశారు. 1956 లో ఆయన భార్య మేరాంబ మరణించిన తర్వాత 1961 లో 'విమలమ్మ' ను ద్వితీయ కళత్రంగా స్వీకరించారు. 1957-69 మధ్యకాలంలో ఆలిండియా రేడియో తెలుగు విభాగంలో 'స్పోకెన్వర్డ్ ప్రొడ్యుసర్ 'ఉద్యోగంచేసి, కుల వివక్షతో అక్కడా అవమానాలు ఎదుర్కొని తిరిగి గుంటూరు వచ్చి, పూర్తిగా కావ్యరచనలో నిమగ్నమయ్యారు. కవితాగోస్టులు, సన్మానాలు ఆయనకు నిత్యకృత్యాలయాయి. 1964 లో ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనమండలి సభ్యునిగా నియమించి సముచితంగా గౌరవించింది. 1965 లో ఆయన వ్రాసిన క్రీస్తు 'చరిత్ర' కావ్యానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతినిచ్చి సన్మానించింది. ఆంధ్రాయూనివర్సిటీ 'కళాప్రపూర్ణ' బిరుదాంకితునిగా చేసింది. గండపెండేరం ధరించి, కనాకాభిషేకాలు పొంది, గజారోహణం చేసి, పల్లకీలలో ఊరేగారు. గబ్బిలము, ఫిరదౌసి, స్వప్నకథ, అనాధ, నేతాజీ, కొత్తలోకం, ముసాఫర్లు, బాపూజీ, ముంతాజ్మహలు, నాకథ, స్వయంవరం, నాగార్జునసాగర్, కాందిశీకుడు, క్రీస్తుచరిత్ర, ఏడుభాగాలుగా వచ్చిన ఖండకావ్య సంపుటి మొ|| కావ్యాలేగాక, తెరచాటు, తారాబాయి, రుక్మిణీకల్యాణం, చిదానందప్రభాతం, హినుదమార్క పరిణయం, ధృవవిజయం, వంటి నాటకాలు కన్యకాపరమేశ్వరి మొ।। ఎన్నో రచనలు చేశారు. కవితాభిమానులు, సాహితీ సంస్థలచే వేయికి. పైగా సన్మానాలు పొందేరు. కవికోకిల, కవితావిశారద, కవిదిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగకవిచక్రవర్తి, కవిసామ్రాట్ మొ। బిరుదులు పొందేరు.
జాషువా సాహితీక్షేత్ర ప్రవేశకాలానికి భావకవిత్వం క్షీణదశకు బీజాలు పడ్డాయి. అభ్యుదయ కవితావికాసం మొగ్గతొడగటం ప్రారంభించింది. ఈ సంధికాలంలో వచ్చిన జాషువా భావకవిత్వం లోని ఆత్మాశ్రయ ప్రధానమైన భావానుభూతి, అభ్యుదయ కవిత్వంలోని సామాజిక పరమైన సమస్యలూ ఇతివృత్తంగా రచనలుసాగించారు. ఆయన రచనలన్నీ ఛందోబద్ధంగావున్నా. రూపంలోనూ, కవితావస్తు స్వీకరణలోనూ, పురాణ ప్రబంధయుగపు కవితలాగా రాచరికపు అహంభావ పూరిత పౌరుషాలో, వారి శృంగారకేళి. కలాపాలలో తీసుకోలేదు. బాల్యంలో తండ్రి వీరయ్య నుండి అనుశ్చతంగా నేర్చుకొన్న గొల్లసుద్దులు, పల్నాటివీరచరిత్ర, మొ|| పాటలు ఆయనకు ఆశుకవితా సంప్రదాయాన్ని నేర్పగా, రాగశృతి లయాన్వితమైన ఆ గీతాలు ఆయన పద్యాల స్వరూపానికొక విశిష్టరూపాన్ని ఏర్పరచాయి. ఈయన కవిత్వం జనసామాన్యానికి చేరువైంది. బలిజేపల్లి వారి 'హరిశ్చంద్ర' నాటకంలో కాటిశీనులో ఇమిడ్చిన జాషువా పద్యాలు నేటికీ జానపదుల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. జాషువాకు ముందే పద్యకవిత్వానికి చాలానుంది కవులు వీడ్కోలు చెప్పేశారు. చాలామంది అభ్యుదయకవులు అప్పటికే గేయ, వచన కవిత్వరూపంలోకి వచ్చినా జాషువాగారు పద్యకవితలే వ్రాశారు. ఏ సాహితీ సాంఘిక రాజకీయ ఉద్యమాలతోనూ ఆయన కు ఆచరణాత్మక సంబంధం లేకపోవడం దీనికి కారణం కావచ్చు. 'నాల్గుపడగల హైందవ నాగరాజు బుసబుసలకు, కడుపు దహించే ఆకలి చీకటి చిచ్చులకూ‘ వ్యతిరేకంగా ఆయన వ్యక్తిగత పోరాటం సాగించారు. మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం ఇస్తూ చెలం అన్నట్లుగా 'తనకూ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కనిచేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వం' అన్నట్లుగా. తనకూ జీవితానికీ మధ్య అగాధాన్ని పూడ్చడానికి పడ్డ సంఘర్షణ సుంచీ ఆయన సామాజిక స్పృహను పొందారు.
అనాటి వరకూ ఆమాట కొస్తే నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశంలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, ఆ కష్టాల కడలి బాధలలోంచీ గళం విప్పిన దళత కవి ఒక్క జాసువాయే. సామాజిక దురన్యాయాలు, కులవివక్షకు చెందిన ఆవేదనను పద్యకావ్యాలలో రూపెత్తించిన మొదటికవి, బహశా చివరి కవి కూడా జాషువానే అని చెప్పుకోవచ్చు. మాల మాదిగల మధ్య వైమనస్యాన్ని, ఆయన నిర్ద్వందంగా ఖండించి, తాను కులాల గీతల మధ్య నిలబడలేనని విస్పష్టంగా ప్రకటించారు. దుర్భర దారిద్ర్యము, క్రూర సాంఘిక వివక్షా అనుభవించిన ఆయన వాటిని తన కావ్యాల్లో పలికించారు. ఆయన సామాజిక, సాహితీ రంగాల్లో సాగించింది. నిష్క్రియా సాహితీ విప్లవం (Passive Literary Revolution) గా చెప్పుకోవచ్చు, కారుణ్య ఛాయలు తప్ప విప్లవంగానీ, హింసగానీ, లేవు. ఆయన ఏనాడూ గుళ్ళకు గానీ, చర్చిలకు గానీ వెళ్ళలేదు. ఆయన క్రైస్తవుల చేతనేకాక, సవర్ణ హిందువుల వెలినీ చవిచూశారు. ఎవరెన్ని సన్మానాలు చేసినా, ప్రభుత్వం ఆదరించినా. ఆదరించుకున్నా. ఆయన ప్రజాకవి, ప్రజాభిమానంతో నిలిచారు.. వివిధ రకాలుగా ఆర్థిక, సామాజిక సాంస్కృతిక వివక్ష అనుభవిస్తూ, ఆనాటి సామాన్య జనజీవితగాథని కరుణరసస్థావితంగాపద్యీకరించారు. జీవితమంతా అవిశ్రాంత సమరంలో వేసారి నిమ్నోన్నత్యాల్ని చూసిన కవి, తెలుగుజాతి గర్వించదగిన మహామనిషి జాషువా 1971 జులై 24 వ తేదీన మరణించారు.
"రాజుమరణించె, నౌకతార రాలిపోయే
కవియు మరణించే, నొకతారగగనమెక్కె రాజుజీవించే నారాతి విగ్రహములందు.
కవియు జీవించే ప్రజల నాలుకలయందు. "
ఆయన అన్న మాటలు ఆయన విషయంలో అక్షరసత్యాలు,
జాషువారచనలలో ఆణిముత్యం 'గబ్బిలం' జాషువా 'గబ్బిలం' కావ్యం ఆయన స్వీయజీవిత చిత్రణగా చాలామంది పండితులు మేధావులూ భావిస్తున్నారు. కులవ్యవస్థలో అమానుష అసమ సంబంధాల్ని, ఆ వ్యవస్థపట్ల, ఆయన అవగాహన, వైఖరీ 'గబ్బిలం' కావ్యంలో వ్యక్తమౌతాయి. చెప్పులు కుట్టి జీవించుట ఆరుంధతీ సుతుని వృత్తి, అతని శ్రమను దోచుకుంటూ అంటరాని వానిగా పరిగణించిన హిందూ సామాజిక దృష్టిని నిరసించారు. అరుంధతీ సుతుని పాత్ర ద్వారా తన కాలంనాటి సామాజిక దుస్తితిని హృదయానికి హత్తుకొనేలా చిత్రించారు జాషువా. ఆ పాత్రద్వారా ఇక్కడి కులవ్యవస్థ, అంటరానితనం, దోపిడీలను బహిర్గతం చేశారు. సామాజిక చైతన్యంతో విశ్వజనీనతను జోడించి, కారుణ్యం, మానవత్వపు విలువలను కలిపి, అస్పృశ్యుని ఆత్మక్షోభను, అంతరంగిక ఆవేదననూ ఆవిష్కరించారు.
ఆయన నిరాశ్రయుడుగా గుంటూరులో కాలం గడుపుతున్న రోజులలో ఆయనకు ఊరిబయట స్మశానం పక్కన ఒక పాడుబడిన ఇల్లు ఆవాసంగా దొరికింది. రాత్రిళ్ళు చిన్న ఆముదపు దీపం. అక్కడ విహరించే గబ్బిలాలే ఆయనకు నేస్తాలయ్యాయి. ఆయన గబ్బిలం కావ్యంలో ‘
‘ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె
విహరణము సేయసాగే గబ్బిల మొకండు
దాని పక్షానిలంబున వాని చిన్ని
యాముదపు దీపమల్లన నాఱిపోయె‘
అంటూ వివరించారు. ఆచీకటిలో, హృదిలో తృటిలో తటిల్లతల్లా మెరిసిన ఆలోచనా గీతమే. గబ్బిలం కావ్యంగా రూపొందింది. ఇందులోని ప్రతి పద్యంలోనూ ఆయన ఆత్మీయస్పర్శ జ్యోతకమౌతుంది. జాషువా తనవై యక్తిక బాధని, తనజాతి జనుల సమిష్టి బాధనీ ప్రత్యేకించి పలికినా, అది సాధారణీకరణాన్ని పొందింది. సర్వ పాఠక సమాదరణనూ పొందింది.
గురజాడ కావ్య ఖండికల రచనకు బాటవేసినా, ఖండకావ్య ప్రక్రియ మాత్రం రాయప్రోలు సుబ్బారావు గారితోనే మొదలైంది. అది జాషువా చేతిలో కొత్త వన్నెలు పొంది పుష్పంగా ఫలించి తెలుగు సాహితీ సుమంగా నిరంతరం సుగంధాల్ని వెదజుల్లతూ వుంది. గబ్బిలం రెండు భాగాలుగా వ్రాశారు. 117 పద్యాలున్న
గబ్బిలం మొదటి భాగానికి 'విజ్ఞప్తి' పేరుతో ప్రవేశిక (ఇంట్రో) వ్రాస్తూ, కాళిదాసు మేఘసందేశాన్ని మనసులో ఉంచుకొని ఈ కావ్యం వ్రాసాననీ, కులీనుడైన రాజు మన్మద తాప తప్తుడై పంపే ప్రణయసందేశానికి రాజహంస దౌత్యం నేరపగా, తుకతుకనుడికే క్షుధాగ్ని పీడితుడి అశ్రుసందేశం పంపేందుకు అతని జీర్ణకుటీరంలో ఉండే గబ్బిలమే సందేశహారిగా గైకొన్న ఔచిత్యాన్ని గ్రహించమని కోరేరు. "ఇంట ప్రవేశించి దీపమార్పిన గబ్బిలమును జూచి తన కన్నీటి కథ ఈశ్వరునితో చెప్పుమని వీదుప్రార్థించెగాని, నిజమునకతని యుద్దేశ్యము దేశారాధన, అంటూ వివరించారు. 'గబ్బిలం' లో కుల వివక్షావ్యతిరేకతత్వం ప్రధాన వస్తువు.
గబ్బిలాన్ని ప్రతీక కావ్యంగా మలచడంలోనే జాషువా ప్రతీక వాద కవితా తత్వాన్ని నిర్వహించారు. పామునకు పాలు, చీమకు పంచదార పోసి పోషించే హైందవ సమాజంలో అపశకునపు పక్షిగా సమాజ దృష్టిలో వుండిన గబ్బిలాన్ని అరుంధతీ సుతునికి ప్రతీకగా గ్రహించారు. ఎందుకంటే అది వెలుగును చూడలేదు. పంచముల జీవితాలు నాడు మరీ దుర్బరంగా వుండేవి. వారి జీవితాల్లో వెలుగులేదు. వారి చీకటి బ్రతుకులకు పక్షిజాతి చేత కూడా వెలివేయబడిన ప్రాణిగనున్న గబ్బిలాన్ని ప్రతీకగా తీసుకు దళితుల దైన్యాన్ని, దయనీయ పరిస్థితిని వివరించారు.
వాని రెక్కల కష్టంబులేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు నానికి భుక్తిలేదు