05/07/2025
*అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు*
*--పీఆర్టీయూ తెలంగాణ*
*తెలుగు వారి తొలి పండుగ తొలి ఏకాదశి విశిష్టత - తొలి ఏకాదశి ఎప్పుడు? ఏం చేయాలి?*
*Tholi Ekadashi 2025:*
*విశేషాల సమాహారంగా భావించే ఆషాఢంలో అన్నీ పండుగలే! ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగు వారి పండుగలు మొదలవుతాయని శాస్త్రవచనం. అందుకే తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. జులై 6 వ తేదీ రేపు ఆదివారం తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.*
*తెలుగు వారి తొలి పండుగ తొలి ఏకాదశి మనకు ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ నాటి నుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే దీనిని శయనైకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది జులై 6వ తేదీ ఆదివారం రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిధి ఉంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.*
*ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం.*
*దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభం తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది.*
*దేవతలకు రాత్రి సమయమని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహా విష్ణువు తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని స్కాందపురాణం ద్వారా తెలుస్తోంది.*
*దక్షిణాయన పుణ్యకాలం అంటే!*
*మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయి ఇక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు, పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.*
*తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఇలా పూజించాలి*
*తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో శ్రీలక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించాలి. తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది. ఆవునేతితో దీపారాధన చేసి, పసుపు రంగు పువ్వులతో, తులసి దళాలతో, అక్షింతలతో శ్రీమన్నారాయణుని పూజించాలి. పులిహోర, చక్రపొంగలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి.*
*ఆలయాలలో ఇలా...*
*ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని విష్ణు ఆలయ దర్శనం చేయాలి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ, భారత భాగవత కధలు చదువుకుంటూ జాగారం చేయాలి. అనంతరం మరుసటి దినం ద్వాదశి ఘడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.*
*పితృదేవతల ప్రీతి కోసం పేలాల పిండి*
*ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.*
*పేలాల పిండిని ఇలా తయారు చేస్తారు*
*వేయించిన పేలాలు, బెల్లం నెయ్యి , ఏలకులు శొంఠి కలిపి రోట్లో దంచి తయారు చేసేదే పేలాల పిండి. వర్షా కాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృ దేవతల పేరుతో పేలాల పిండిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.*
*పంట పొలాల్లో కూడా తొలకరి వానలు కురిసే ఈ సమయంలో రైతులు తమ పొలాల్లో కూడా ఈ పేలాలు పిండి చల్లుతారు. ఇందువలన వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. రానున్న తొలి ఏకాదశి పండుగను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులవుదాం. జై శ్రీమన్నారాయణ!*
*ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.*
(ఈటీవీ నుండి సేకరించబడినది.)