04/07/2026
ప్రచురణార్థం నల్గొండ
తేది: 04-07-2026
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు ఘన నివాళులు
డివైఎఫ్ఐ – ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండలో వర్ధంతి కార్యక్రమం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండలోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దొడ్డి కొమురయ్య తొలి అమరుడని పేర్కొన్నారు. ఆయన అమరత్వం తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిందని, నాటి నైజాం పాలన, రజాకారులు, దొరల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు ఆయుధాలు చేపట్టి పోరాడేందుకు దొడ్డి కొమురయ్య త్యాగం ప్రేరణగా నిలిచిందన్నారు.
ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో వెట్టి చాకిరి, దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య అతి చిన్న వయసులోనే అమరుడయ్యారని తెలిపారు. నాటి నైజాం పాలనలో దొరలు ప్రజలపై అమానుష హింసలు, అక్రమ పన్నులు విధిస్తూ, ప్రశ్నించిన వారిని హతమార్చేవారని గుర్తు చేశారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సుమారు 4 వేల మంది అమరులయ్యారని, లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టే చారిత్రాత్మక మార్పులకు ఈ పోరాటం దోహదపడిందన్నారు. జనగామ జిల్లా కడివెండి గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ రైతాంగ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్నారు.
దొడ్డి కొమురయ్య ఆశయాలు, పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థి, యువజన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు గుండాల నరేష్, మారుపాక కిరణ్,యం డి అదిల్, కార్లపూడి రాము,గోపి చందు, బాలరాజు,రోహిత్, ముకేశ్, సాయి, హరీష్,మాధవ్ యాదగిరి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.