13/05/2019
* #14 నుంచి టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్ #*
* 22న సీట్ల కేటాయింపు
* ధ్రువపత్రాల పరిశీలనకు కొత్తగా స్లాట్ బుకింగ్ విధానం
తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 14 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. పదోతరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ ఖరారైన నేపథ్యంలో మే 10న పాలిసెట్ ఛైర్మన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ సమక్షంలో ప్రవేశాల కమిటీ సమావేశమై కౌన్సెలింగ్ కాలపట్టికకు తుదిరూపునిచ్చింది. గతంలో ఏ రోజు ఏ ర్యాంకు వారు ధ్రువపత్రాల పరిశీలనకు రావాలో అధికారులే నిర్ణయించేవారు. ఈసారి విద్యార్థులు మే 15-18 తేదీల మధ్య.. నాలుగు రోజుల్లో వీలున్న ఒక తేదీని, సమయాన్ని (గంటకు ఒక స్లాట్ చొప్పున) ఎంపిక చేసుకొని వచ్చేలా మార్పులు చేశారు.
కాలపట్టిక ఇదీ...
* మే 14-16: ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నింపడం, ప్రాసెసింగ్ రుసుం చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు సహాయ కేంద్రాన్ని ఎంచుకోవడం, తేదీ, సమయం ఖరారు చేసుకోవడం
* మే 15-18: ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి ధ్రువపత్రాల పరిశీలన
* మే 15-19: కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చుకోవడం
* మే 19న: ఇచ్చిన ఆప్షన్లను నిలుపుదల చేయడం (ఫ్రీజింగ్)
* మే 22: సీట్ల కేటాయింపు
* మే 23-25 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, కళాశాలలో చేరుతామంటూ వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం
* జూన్ 1: కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్ చేయడం, తరగతుల ప్రారంభం.
గత ఏడాది ర్యాంకులు.. ప్రవేశాలు కావాలంటే?
గత ఏడాది ఏ ర్యాంకు వారికి ఎక్కడ సీటు వచ్చిందో తెలుసుకొని.. ఆ ప్రకారం ఐచ్ఛికాలు ఇవ్వడంలో ఒక అంచనాకు వచ్చేందుకు సమాచారాన్ని వెబ్‌సైట్లో ఉంచారు. ప్రవేశాల ప్రకటన, ఇతర సమాచారాన్ని విద్యార్థులు వైబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ ధ్రువపత్రాలు అవసరం
కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, పదోతరగతి తత్సమాన విద్యార్హత మెమో, 4-10 తరగతుల స్టడీ సర్టిఫికెట్, టీసీ, 2019 జనవరి 1వ తేదీ లేదా తర్వాత పొందిన ఆదాయం సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వేషన్ ఉన్న వారు). విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజును కేవలం క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలి.